కేరళ కూటములకు ప్రత్యామ్నాయం భాజపానే..

తాజా వార్తలు

Updated : 24/03/2021 17:06 IST

కేరళ కూటములకు ప్రత్యామ్నాయం భాజపానే..

తిరువనంతరపురం: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటములకు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని కేరళ ప్రజలు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించిన ఆయన, గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రపై విరుచుకుపడ్డారు. ఈ స్కాంలో మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పాత్ర ఉందా? లేదా? అనే విషయంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

గోల్డ్‌ స్కాంపై కేంద్ర సంస్థలు దర్యాప్తుపై రాష్ట్ర సర్కార్‌ విమర్శలు చేస్తుండడంపైనా కేంద్రమంత్రి అమిత్‌ షా స్పందించారు. దేశంలో ఏ కుంభకోణం జరిగినా వాటిపై భారతీయ సంస్థలే దర్యాప్తు జరుపుతాయని, ఐరాస వంటి సంస్థలు కావని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. త్రిపునిథురలో జరిగిన రోడ్‌షోకు భారీ సంఖ్యలో ప్రజల నుంచి స్పందన వచ్చిందన్నారు. కేరళ ప్రజలు భాజపాకు మద్దతు తెలుపుతున్నారనడానికి ఇదే నిదర్శమని అమిత్‌ షా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను బహిరంగ సభ ద్వారా అక్కడి ప్రజలకు అమిత్‌ షా వివరించే ప్రయత్నం చేశారు.

వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..

కేరళకు చెందిన ఇద్దరు క్రైస్తవ బోధకులు రైలు ప్రయాణంలో వేధింపులకు గురైన ఘటనపై కేంద్ర హోం మంత్రి మాట్లాడారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రచార సభలో ఉన్న అమిత్‌ షా హామీ ఇచ్చారు. రైలు ప్రయాణం చేస్తోన్న కేరళ క్రైస్తవ మహిళా బోధకులను ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఝాన్సీ సమీపంలో కొందరు యువకులు వేధింపులకు గురిచేసి రైలు నుంచి దించివేశారనే ఆరోణలు వచ్చాయి. వీరు మతప్రచారం చేస్తున్నారంటూ కొందరు భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, మహిళా బోధకులను మరో రైలులో స్వస్థలాలకు పంపించారు. అయితే, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేరళలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌ షా, నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని