విజయవంతంగా ‘ఉక్కు’ బంద్‌

తాజా వార్తలు

Updated : 05/03/2021 15:15 IST

విజయవంతంగా ‘ఉక్కు’ బంద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఉక్కు’ సంకల్పంతో బంద్‌ నిర్వహిస్తున్నారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ బంద్‌ కొనసాగుతోంది. భాజపా మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం బంద్‌కు సహకరించాయి. ‘విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు’ అని నినదించాయి. విద్యా, వాణిజ్య సంస్థల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. చెదురు మదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.  

అమరావతి రైతుల మద్దతు


విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ జరుగుతున్న బంద్ కు అమరావతి రైతులు మద్దతు తెలిపారు. రాజధాని గ్రామాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బంద్ లో భాగంగా రాజకీయ పక్షాలు, రైతులు మందడంలో రోడ్డుపై బైఠాయించారు. సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు.. పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుని నిరసిస్తూ ఓ రైతు రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
 

కైకలూరులో తెదేపా, వైకాపా ఘర్షణ

 ‘ఉక్కు’ ఆందోళన సందర్భంగా కృష్ణా జిల్లా కైకలూరులో వైకాపా, తెదేపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో కైకలూరులో తెదేపా, వైకాపా, వామపక్ష శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ప్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఈక్రమంలో తెదేపా ఇన్‌ఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైకాపా కార్యకర్తలు చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. వైకాపా శ్రేణుల తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ, తెదేపా కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈఘటనతో కైకలూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

గుంటూరులో స్వల్ప ఉద్రిక్తత

బంద్ సందర్భంగా గుంటూరులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలపక్ష నేతలు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించి వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేయించారు. శంకర్ విలాస్ కూడలిలో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అక్కడ ఆటోలు, బస్సులను అడ్డుకున్నారు. వాహనాల టైర్లలో గాలి తీసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రహదారిపై ఆందోళన చేయటంతో శంకర్ విలాస్ పై వంతెన మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని