అసోంలో సీఏఏ అమలు చేయం: రాహుల్‌

తాజా వార్తలు

Updated : 20/03/2021 06:19 IST

అసోంలో సీఏఏ అమలు చేయం: రాహుల్‌

గువాహటి: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అసోంలోని దిబ్రుఘర్‌ జిల్లాలో రాహుల్‌ పర్యటించారు. అక్కడి లాహోవల్‌ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అధికార భాజపాకు చురకలంటించారు. ఏ మతమూ విద్వేషాన్ని రెచ్చగొట్టమని చెప్పదని, భాజపా మాత్రం సమాజాన్ని విభజించడానికి మతాన్ని వాడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగా నాగ్‌పూర్‌లోని శక్తి (ఆర్‌ఎస్‌ఎస్‌) వారిని నడిపిస్తోందని చెప్పారు. భాజపా పని విభజించడమైతే.. కాంగ్రెస్‌ బాధ్యత కలపడమని చెప్పారు. విద్వేషం, నిరుద్యోగానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒకటి పెరిగితే మరొకటి కచ్చితంగా పెరుగుతుందన్నారు.

అసోం ప్రజల సంపత్తిని భాజపా బయటి వ్యక్తులకు తాకట్టు పెడుతోందని రాహుల్‌ అన్నారు. తేయాకు తోటలు, గువాహటి విమానాశ్రయం ఇందులో భాగమేనన్నారు. వారు దేన్నైనా ప్రైవేటీకరణ చేయొచ్చని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు విద్యను మాత్రం చేయలేరని పేర్కొన్నారు. విద్య, వైద్యం వాణిజ్యపరం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పటికే మూడు నల్ల చట్టాలతో దేశానికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వీటిని ప్రశ్నించే వారిని భాజపా జైళ్లకు పంపుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య రక్షణకు యువత కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అసోంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఏఏ రద్దు సహా ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్, రోజు వారి కూలి రూ.365కు పెంచుతామని రాహుల్‌ హామీ ఇచ్చారు. శనివారం గువాహటిలో జరగబోయే సభలో ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని