మహిళలను గౌరవించని డీఎంకే, కాంగ్రెస్‌!

తాజా వార్తలు

Published : 02/04/2021 16:12 IST

మహిళలను గౌరవించని డీఎంకే, కాంగ్రెస్‌!

విమర్శించిన ప్రధానమంత్రి మోదీ

మధురై: మహిళలకు భద్రత, వారి గౌరవాన్ని కాపాడటంలో డీఎంకే, కాంగ్రెస్‌ హామీ ఇవ్వలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీలు మహిళలను ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉంటాయని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు మదురై నగరంలో పర్యటించిన మోదీ, డీఎంకే నేత ఎ.రాజా ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.

‘నారీ శక్తిని సాధికారితవైపు నడిపించడంలో మదురై మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. మహిళలను గౌరవించడం, పూజించే సంస్కృతిని మదురైలో చూస్తూనే ఉన్నాం. ఈ సమయంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడే కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు మహిళా భద్రతకు హామీ ఇవ్వలేవు’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇక శాంతి, సామరస్యాలతో విరాజిల్లే మదురై నగరాన్ని డీఎంకే నేతలు మాఫియా కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మదురై నగర విలక్షతను గుర్తించలేని ఈ పార్టీలు మహిళలను పదే పదే అవమానపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ టెక్స్‌టైల్స్‌ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ‘మిత్రా’ పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించామని.. తద్వారా రానున్న మూడేళ్లలో ఏడు టెక్స్‌టైల్‌ పార్కులు రానున్నాయని చెప్పారు.

ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాతృమూర్తిపై డీఎంకే నేత ఎ.రాజా అనుచిత వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు కాగా, ఎన్నికల సంఘం కూడా చర్యలు చేపట్టింది. ఎ.రాజాను 48గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇదిలాఉంటే, రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఎన్‌డీఏ కూటమి తరపున ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు చేస్తుండగా, అటు డీఎంకే మిత్రపక్షాలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఏప్రిల్‌ 6వ తేదీన ఒకే దశలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుంది. మే 2వ ఓట్ల లెక్కింపు చేపడుతారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని