ఓటమి భయంతోనే తెరాస గూండాగిరీ: ఈటల 

తాజా వార్తలు

Updated : 19/07/2021 15:54 IST

ఓటమి భయంతోనే తెరాస గూండాగిరీ: ఈటల 

కమలాపూర్‌‌: ఓడిపోతామనే భయంతోనే హుజూరాబాద్‌లో తెరాస గూండాగిరీ చేస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం హుజూరాబాద్‌ నుంచే మొదలవుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగనున్న తన ప్రజా జీవనయాత్ర కమలాపూర్‌ మండలం బత్తివానిపల్లి నుంచి ఈటల ప్రారంభించారు. తొలుత ఆంజనేయ స్వామి ఆలయంలో తన సతీమణి జమునతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులను నేరుగా కలుసుకున్న ఈటల..  తన పాదయాత్రకు కావాలనే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రకు ప్రభుత్వం ఆటంకాలు కల్పించవద్దన్నారు.ఓటమి భయంతో ప్రజల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాము ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని, కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.

తన పాదయాత్ర సజావుగా కొనసాగేలా చూసే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదేనన్నారు. ఇది భాజపా పాదయాత్రే.. తెరాసది కాదన్న ఈటల.. ప్రజల్ని భయపెట్టి ఏదో సాధించాలనే పిచ్చివేషాలు వేస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.  ప్రజా జీవన యాత్రకు అండగా ఉండేందుకు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారన్నారు. ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిపేలా సాగుతున్న ఈ యాత్రను ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని ఈటల విజ్ఞప్తి చేశారు. 

జానపద నృత్యాలు, కులవృత్తుల జీవన విధానాలను  ప్రతిబింబించేలా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ప్రారంభమైన ఈ పాదయాత్రలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, భాజపా సీనియర్‌ నేతలు ఎంపీ వివేక్‌, జితేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని