హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండాయే

తాజా వార్తలు

Updated : 19/06/2021 18:51 IST

హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయ జెండాయే

మాజీ మంత్రి ఈటల రాజేందర్

హుజూరాబాద్‌ గ్రామీణం: తెలంగాణలో ఎలాంటి పాలన కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలను యాచకులుగా మార్చే పాలన నడుస్తోందని ఆరోపించారు. హుజూరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పార్టీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రావు పద్మతో కలిసి ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజల చెమట సొమ్మేనని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆర్థిక ప్రతిఫలాలతో పాటు ఆత్మ గౌరవమూ అంతే ముఖ్యమన్నారు. కులమతాలతో ఎలాంటి సంబంధం లేదని.. తన తొలి ప్రాధాన్యత కార్యకర్తలకే అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ డబ్బు, అధికారం, ప్రలోభాలను నమ్ముకున్నారని ఈటల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తెరాసకు డిపాజిట్‌ కూడా రాదన్నారు. సొంత పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే దౌర్భాగ్య స్థితిలో తెరాస ఉందని పేర్కొన్నారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. హుజూరాబాద్‌లో జరిగేది కురుక్షేత్ర సంగ్రామమని.. ధర్మం, న్యాయం అంతిమ విజయం సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్తశుద్ధితో పని చేసిన వ్యక్తి ఈటల: బండి సంజయ్‌

‘‘ఈటల రాజేందర్‌ భాజపాలో చేరడం చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారు. స్వార్థం, రాజకీయ లబ్ధికోసం ఈటల భాజపాలో చేరలేదు. పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినవాళ్లు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. వాస్తవాలను నిర్భయంగా చెప్పేవారికి తెరాసలో స్థానం లేదు. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధితో పని చేసిన వ్యక్తి ఈటల రాజేందర్‌. ఆలోచన, ఆశయం అనేవి సీఎం కేసీఆర్‌కు లేవు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు. ప్రభుత్వ భూములను అమ్మే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారు? తెరాస నేతలు కబ్జా చేసిన భూములను అమ్మితే సరిపోతుంది. హైదరాబాద్‌ చంచల్‌గూడ జైలును కూడా కూల్చేందుకు ప్రయత్ని్స్తున్నారు. తెరాస అరాచక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భాజపా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఎంత కష్టపడినా హుజూరాబాద్‌లో భాజపా గెలుపును ఎవరూ అడ్డుకోలేదు’’ బండి సంజయ్‌ అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని