ఇది విజయన్‌ అందించిన విజయం!

తాజా వార్తలు

Updated : 02/05/2021 15:37 IST

ఇది విజయన్‌ అందించిన విజయం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండోసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ, ఈసారి సీఎం విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి ఆ చరిత్రను తిరగరాసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ అంచనా వేసినట్లుగా స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్‌ కూటమిపై విజయాన్ని సొంతం చేసుకుంది. వాస్తవానికి కేరళలో ఎల్‌డీఎఫ్‌ కూటమి గెలుపు వామపక్ష పార్టీలకు కూడా ఎంతో కీలకం. దేశంలో ప్రస్తుతం లెఫ్ట్‌ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళనే కావడం గమనార్హం. అయితే, ఎల్‌డీఎఫ్‌ గెలుపులో సీఎం విజయన్‌దే కీలకపాత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

సంక్షేమమే ప్రధానాస్త్రం..

ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్‌కు విజయనే అన్నీ తానై వ్యవహరించారు. ప్రభుత్వంలో ఆయనకు ‘స్ట్రాంగ్‌ మ్యాన్‌’ అన్న ఇమేజ్‌ కూడా ఉంది. సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ చూరగొన్న ఆయన వరదలు, నిఫా, కరోనా వైరస్‌తో తలెత్తిన సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఉచిత ఆహార కిట్ల పంపిణీ విజయన్‌ను విజయ తీరాలకు దగ్గర చేశాయి. అలాగే రోడ్లు, రహదారులు, వంతెనలు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో విజయన్‌ పనితీరుకు గత డిసెంబరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు ఆమోద ముద్ర వేశారు. ‘రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, వంతెనలు ఐదేళ్ల క్రితం ఉన్నట్లే ఇప్పుడూ ఉన్నాయా?’ అంటూ విజయన్‌ ప్రచారంలో ప్రజలకు సంధించిన ప్రశ్నలకు ప్రజలు ఓట్ల రూపంలో ఆయనకు సమాధానం చెప్పారు.

అవినీతి ఆరోపణల్ని పట్టించుకోని ప్రజలు..

ఎల్‌డీఎఫ్‌ కూటమిని అవినీతి కుంభకోణాలు కొంతమేర ఇబ్బంది పెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా బంగారం స్మగ్లింగ్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉందన్న ఆరోపణలు ఓ దశలో కేరళ రాజకీయాలను కుదిపేశాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు కేరళకు క్యూ కట్టాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, జాతీయ దర్యాప్తు సంస్థ, కస్టమ్స్‌ ఇలాంటి పలు సంస్థలు కేరళ లెఫ్ట్‌ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై విచారణ పేరిట విరుచుకుపడ్డాయి. కానీ, వాటి ఫలితాలు ఇంకా తేలలేదు. దీంతో ఎల్‌డీఎఫ్‌ దీన్ని అనుకూలంగా మార్చుకుంది. ముఖ్యంగా విజయన్‌ దీన్ని ఓ అస్త్రంగా వాడుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కేరళపై కక్ష కట్టిందని ప్రచారం చేశారు. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తోందని ఆరోపించారు. దీంతో ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల్ని సామాన్య ప్రజలు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. పైగా విజయన్‌ సర్కార్‌ సంక్షేమ ఫలాల మధ్య ఓటర్లకు అవి పెద్దగా కనిపించలేదనే చెప్పాలి.

సైబర్‌ ఆర్మీ...

దేశవ్యాప్తంగా భాజపా సాధిస్తున్న విజయాల్లో ఆ పార్టీ ఐటీ సెల్‌ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో అందరికీ తెలిసిందే. అదే తరహాలో కేరళలో సీపీఐ(ఎం) సైబర్‌ ఆర్మీ పేరిట ఓ సామాజిక మాధ్యమ వేదికను నెలకొల్పింది. ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సాధించిన ఫలాలు, విజయన్‌ కృషిని కార్యకర్తలు సైబర్‌ ఆర్మీ వేదికగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించేవారు. ఇది కూటమి గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందని ఎన్నికలకు ముందే పార్టీ వర్గాలు బలంగా విశ్వసించాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని