కాంగ్రెస్‌కు షాక్‌.. టీఎంసీలోకి ప్రణబ్‌ తనయుడు

తాజా వార్తలు

Updated : 05/07/2021 17:13 IST

కాంగ్రెస్‌కు షాక్‌.. టీఎంసీలోకి ప్రణబ్‌ తనయుడు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తోన్న ఊహాగానాలకు తెరదించుతూ మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోల్‌కతాలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన టీఎంసీ కండువా కప్పుకున్నారు. 

తృణమూల్‌లో చేరేందుకు గత కొన్ని వారాలుగా అభిజిత్‌ చర్చలు జరిపారు. ఇటీవల కోల్‌కతాలో టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీని కలిశారు. మరోవైపు కోల్‌కతాలో చోటుచేసుకున్న నకిలీ టీకా కార్యక్రమంపై పశ్చిమ్‌ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు. నకిలీ టీకా కార్యక్రమానికి మమతా బెనర్జీని నిందించాల్సి వస్తే.. నీరవ్‌మోదీ, విజయ్ మాల్యా, మోహుల్ చోక్సీ చేసిన కుంభకోణాలకు మోదీజీని బాధ్యుల్ని చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో తృణమూల్‌లో ఆయన చేరిక ఖాయమేనని ఊహాగానాలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ నేడు ఆయన అధికారికంగా దీదీ పార్టీలో చేరారు.  

ముర్షిదాబాద్‌లోని జంగిపూర్‌ లోక్‌సభ నియోజకర్గం నుంచి అభిజిత్‌ గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలుపొందారు. 2012లో ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన జంగిపూర్‌ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. అప్పుడు కాంగ్రెస్‌ తరఫున అభిజిత్‌ ముఖర్జీ పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లోనూ గెలిచారు. నల్‌హతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. బెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో జరగబోయే జంగిపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల బరిలో టీఎంసీ ఆయనకు టికెట్‌ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో జంగిపూర్‌ నుంచి పోటీలో ఉన్న ఓ అభ్యర్థి పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు మృతిచెందారు. దీంతో ఆ ఎన్నికను ఈసీ వాయిదా వేసింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని