‘తలకిందులుగా తపస్సుచేసినా రాజధానిమారదు’

తాజా వార్తలు

Updated : 08/01/2020 11:37 IST

‘తలకిందులుగా తపస్సుచేసినా రాజధానిమారదు’

సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

అమరావతి: సుపరిపాలన అందించాలని జగన్‌కు ప్రజలు అధికారం అప్పగిస్తే రాజధాని సమస్య సృష్టించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తుంటే ఏదో జరిగినట్టు వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు చేయాలంటూ బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ఐదు కోట్లమంది భవిష్యత్‌ను ఆ కమిటీ ఐదు రోజుల్లో తేల్చేస్తుందా? అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మార్చలేరని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రధాని శంకుస్థాపన చేసి, రూ.2,500 కోట్లు నిధులిచ్చాక, జగన్‌ రాజధానిని మార్చేదేముందని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదని చెప్పారు. సీఎం జగన్‌కు సలహాలిచ్చేందుకు సరైన మంత్రులు లేరా?అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

సీఎం జగన్‌కు జాతకాల పిచ్చి: జవహర్‌

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జాతకాల పిచ్చి పట్టిందని మాజీ మంత్రి జవహర్‌ మండిపడ్డారు. రాజధానిని విశాఖకు మార్చాలని ఆయనకు స్వరూపానంద సరస్వతి సలహా ఇచ్చారని ఆరోపించారు. రాజధాని కోసం రైతులు పోరాడుతుంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అమరావతికి మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి కోసం వైకాపా ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేయాలన్నారు. కుట్రలో భాగంగానే రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి ఎమ్మెల్యే పిన్నెల్లి వచ్చారని ఆయన విమర్శించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంలో మంత్రి కొడాలి నానితో పిన్నెల్లి పోటీపడుతున్నారని జవహర్‌ విమర్శించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని