రాష్ట్రానికి కోతలే తప్ప వచ్చిందేమీ లేదు:హరీశ్‌ రావు

తాజా వార్తలు

Published : 14/03/2020 00:41 IST

రాష్ట్రానికి కోతలే తప్ప వచ్చిందేమీ లేదు:హరీశ్‌ రావు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ ప్రజలకు ఆశాజనకంగా ఉంటే ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. శాసన మండలిలో బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. విద్యార్థులు ఇతర కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతోనే ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ నిధులు తగ్గాయని వివరించారు. సభ్యులు రాష్ట్ర అప్పులను జీఎస్డీపీని దృష్టిలో పెట్టుకొని చూడాలన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని 21.3 శాతం లోబడే అప్పులు తీసుకున్నట్లు సభకు తెలిపారు. 24 రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి దాటి అప్పులు తీసుకున్నాయని అయితే తెలంగాణ మాత్రం పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపుకోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అనేక శాఖల నుంచి విద్యారంగానికి బడ్జెట్‌లో 12.4 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1.23 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కోతలే తప్ప నిధులు వచ్చిందేమీ లేదన్నారు. కేంద్రం నుంచి ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీఎస్టీ బకాయిలు రూ.9,033 కోట్లు రావాలని సభ్యులకు హరీశ్‌ తెలియజేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అదేవిధంగా 14వ ఆర్థిక సంఘం నుంచి కూడా రూ.395 కోట్లు నిధులు రావాల్సి ఉందని ప్రకటించారు. పీఆర్సీపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మండల, జిల్లా పరిషత్‌లకు గ్రామపంచాయతీ తరహాలో నిధులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. దశల వారీగా పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, త్వరలో యూనివర్సిటీల్లో ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని