ఇప్పటికైనా జగన్‌ మారాలి: అచ్చెన్నాయుడు

తాజా వార్తలు

Updated : 18/03/2020 16:53 IST

ఇప్పటికైనా జగన్‌ మారాలి: అచ్చెన్నాయుడు

అమరావతి: సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా సీఎం జగన్‌ వైఖరి మారాలని తెదేపా సీనియర్‌ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. సుప్రీం తీర్పునకు జగన్‌ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ సడలించడాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఈసీకి కులాన్ని ఆపాదించిన జగన్‌ ఇప్పుడు ఎవరికి కులం ఆపాదిస్తారని నిలదీశారు. కరోనా వైరస్‌ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. విదేశాల్లో ఉండే ఆంధ్రులు విమానాశ్రయాల్లో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రికి పట్టదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరోనా వైరస్‌ నియంత్రణపై దృష్టిపెట్టాలని కోరారు. దేశం మొత్తం కరోనా వైరస్‌ గురించి భయపడుతుంటే సీఎం జగన్‌కు మాత్రం పట్టడంలేదన్నారు.

సీనియర్‌నేత వర్ల రామయ్య మాట్లాడుతూ... ‘‘కరోనా వైరస్‌పై సీఎం జగన్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది కరోనా బారినపడ్డారు. 8వేల మంది చనిపోయారు.  బ్లీచింగ్‌ పౌడర్‌, పారాసిటమాల్‌తో కరోనా వైరస్‌ పోతుందనడం హాస్యాస్పదం. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై సమీక్షచేయాలి. ప్రజలకు సోకకుండా సరైన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని