హైకోర్టును కూడా తరలిస్తారేమో?: కన్నా

తాజా వార్తలు

Published : 11/04/2020 00:25 IST

హైకోర్టును కూడా తరలిస్తారేమో?: కన్నా

గుంటూరు: అహంకారపూరిత చర్యలతో ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారని.. ఇలాంటి అరాచకాలు మునుపెన్నడూ చూడలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ను తొలగించడంపై కన్నా స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇవన్నీ చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేశారంటూ ఎస్‌ఈసీని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఒక బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపితే కౌన్సిల్‌ను రద్దు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని కన్నా గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం, గవర్నర్‌కు లేఖ రాస్తానని కన్నా తెలిపారు.

అలా చేయడమే నేరమా?: సోమిరెడ్డి

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని కాపాడటమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేసిన నేరమా? అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిన అధికారులతో పాటు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై కక్ష సాధింపులే పనిగా పెట్టుకున్నారు. ప్రపంచమంతా కరోనాతో కల్లోలంగా ఉంటే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనలు మాత్రం భిన్నంగా ఉండటం దురదృష్టకరం. ఇది నియంత రాజ్యం కాదని.. ప్రజాస్వామ్య దేశమన్న సంగతి సీఎం జగన్‌ గుర్తించాలి’ అని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని