కార్యకర్తలకు పాదాభివందనం : చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 27/05/2020 13:54 IST

కార్యకర్తలకు పాదాభివందనం : చంద్రబాబు

అమరావతి: కార్యకర్తల త్యాగాలు జీవితంలో మరిచిపోలేనని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో భాగంగా పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు జూమ్‌ వెబినార్‌ ద్వారా ప్రసంగించారు. గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరమన్న ఆయన.. శారీరకంగా మానసికంగా, ఆర్థికంగా కార్యర్తలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తెదేపా కార్యకర్తలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ శ్రేణులను బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. 

‘‘కుటుంబ సభ్యులు హత్యకు గురైనా శ్రేణులు వెనుకంజ వేయలేదు. ప్రాణాలు పోయినా పార్టీని వదిలేది లేదని చెప్పారు. ఆర్థికంగా కుంగదీసినా, హింసించినా పార్టీ వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. కరోనా కష్టాల్లో తెదేపా కార్యకర్తల సేవాభావం మరువలేం’’ అని చంద్రబాబు అన్నారు. తెదేపా హాయంలో వినూత్న పద్ధతుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా చేశామని గుర్తు చేశారు. జంటనగరాలకు తోడుగా సైబరాబాద్‌ను నిర్మించాం..అభివృద్ధికి అనుకూల వాతావరణం సృష్టించామని తెలిపారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశామన్నారు.

‘‘సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం. ఎన్టీఆర్‌ హయాంలో ఆత్మగౌరవాన్ని ప్రభోదించారు. మా హయాంలో ఆత్మవిశ్వాసం పెంచాం. 36 ఏళ్ల చరిత్రలో 22 ఏళ్లు అధికారంలో, 16 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశాం. తెదేపా హయాంలో చేపట్టిన పథకాలు దేశానికి మార్గదర్శకమయ్యాయి’’ అని చంద్రబాబు వివరించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మహానాడుకు పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్‌, బోండా ఉమా, పట్టాభి తదితరులు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని