‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 10/06/2020 15:39 IST

‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ: చంద్రబాబు

విజయవాడ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జగనన్న చేదోడు’ మరో జగన్మాయ పథకమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. అబద్ధమే వైకాపా ఆయుధమని వ్యాఖ్యానించారు.  గతంలో అందరికీ లబ్ధి చేస్తామని చెప్పి.. ఇప్పుడు షాపులు ఉన్నవాళ్లకే పథకం వర్తిస్తుందని మాట మార్చారని దుయ్యబట్టారు. బుధవారం పార్టీ ముఖ్యనాయకులతో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ..

‘‘జగనన్న చేదోడు’ పేరుతో భారీగా కోతలు పెట్టారు. రాష్ట్రంలో 5.50లక్షలకు పైగా నాయి బ్రాహ్మణులుంటే 38వేల మందికే ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తున్నారు. పథకం ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే రూ.10వేలకంటే రెట్టింపు వారినుంచి లాక్కుంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 13లక్షల మంది టైలర్లు ఉంటే 1.25లక్షల మందికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రజకులు 15లక్షల మంది ఉంటే 82వేల మందికే ఈ పథకం వర్తిస్తోంది’ అని చంద్రబాబు మండిపడ్డారు. 

జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుడు వార్తలతో ప్రజలను నమ్మించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక అసత్యాలతో నయ వంచన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులు, ప్రలోభాలతో కొందరిని వైకాపా లోబర్చుకుంటోందని ఆక్షేపించారు. వేధింపులకు భయపడే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారన్నారు. వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదని.. ఒకరుపోతే వంద మంది నాయకులను తయారు చేస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘రాజకీయ విశ్వవిద్యాలయం’ తెలుగుదేశమని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా నాయకులను తయారుచేసే కార్ఖానా అని.. మళ్లీ సమర్థ నాయకత్వాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. రాబోయే 40ఏళ్లకు దీటుగా నాయకత్వాన్ని తయారు చేస్తామని చెప్పారు. దానికి తగ్గ ఓపిక, బాధ్యత తనకు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని