బాబాయి Vs అబ్బాయి: స్పీకర్‌కు చిరాగ్ లేఖ

తాజా వార్తలు

Published : 17/06/2021 01:37 IST

బాబాయి Vs అబ్బాయి: స్పీకర్‌కు చిరాగ్ లేఖ

ఎల్జేపీ సభాపక్ష నేతగా తననే గుర్తించాలని విజ్ఞప్తి

పట్నా: బిహార్‌లోని లోక్‌జన శక్తి పార్టీ (ఎల్జేపీ)లో బాబాయి, అబ్బాయి మధ్య పోరు తారస్థాయిలో కొనసాగుతోంది. పరస్పరం బహిష్కరణ ప్రకటనలతో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ నేత చిరాగ్‌ పాసవాన్‌ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఎల్జేపీ లోక్‌సభాపక్ష నేతగా తన బాబాయి పశుపతి నియామకం చెల్లదని, ఇది పార్టీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. పశుపతిని ఎల్‌జేపీ లోక్‌సభాపక్ష నేతగా గుర్తిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్నిసమీక్షించాలని కోరారు. తనను ఎల్జేపీ లోక్‌సభాపక్ష నాయకుడిగా గుర్తించి కొత్త సర్క్యులర్‌ జారీ చేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.అలాగే, తనకు వ్యతిరేకంగా చేతులు కలిపిన ఐదుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

ఎల్జేపీ నుంచి లోక్‌సభలో మొత్తం ఆరుగురు ఎంపీలు ఉండగా.. చిరాగ్‌ పాసవాన్‌ బాబాయి పశుపతి కుమార్‌ పరస్‌ నేతృత్వంలో ఐదుగురు ఎంపీలు తిరుగుబావుటా ఎగురవేశారు. వీరంతా పశుపతిని లోక్‌సభలో తమ నేతగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ విషయాన్ని ఇటీవల స్పీకర్‌కుతెలియ జేయగా.. లోక్‌సభ సచివాలయం పశుపతి కుమార్‌ పరస్‌ను ఎల్జేపీ సభాపక్ష నేతగా గుర్తిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఎల్జేపీ పార్టీపై పట్టు నిలుపుకొనేందుకు రెండు వర్గాలూ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. తిరుగుబాటు చేసిన ఐదుగురు ఎంపీలపై ఎల్జేపీ చీలికవర్గం నేత చిరాగ్‌ మంగళవారం వేటు వేశారు. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు..  తన బాబాయ్‌ పశుపతి సారథ్యంలోని వర్గం.. చిరాగ్‌ను ఇప్పటికే పార్లమెంటరీ పార్టీ నేతగా తప్పించగా.. తాజాగా  పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. సూరజ్‌భాన్‌ సింగ్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ పరిణామాలతో చిరాగ్‌ పాసవాన్‌ ఒంటరైనట్టయింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని