29 ఏళ్లకే ఎంపీ.. ఇప్పుడు ‘హ్యాట్రిక్‌ సీఎం’! 

తాజా వార్తలు

Updated : 05/05/2021 14:45 IST

29 ఏళ్లకే ఎంపీ.. ఇప్పుడు ‘హ్యాట్రిక్‌ సీఎం’! 

దీదీ రాజకీయ ప్రస్థానం

బెంగాల్‌ సీఎం పీఠాన్ని తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధిష్ఠించారు. భాజపా నుంచి గట్టి సవాళ్లు ఎదురైనా.. కాంగ్రెస్‌, లెఫ్ట్‌, ఐఎస్‌ఎఫ్‌ కలిసి పోటీచేసినా అవేవీ దీదీ నిరాడంబరత, ప్రజాదరణ ముందు నిలవలేకపోయాయి. నందిగ్రామ్‌లో హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో ఓడినా తృణమూల్‌ కాంగ్రెస్‌కు 213 సీట్లతో అపూర్వ విజయం సాధించి పెట్టిన దీదీ.. బెంగాల్‌లో హ్యాట్రిక్‌ సీఎంగా బుదవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు.

మమత ప్రస్థానం ఇదీ..


మమత తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. వైద్యానికి ఖర్చు చేయలేని దయనీయ పరిస్థితుల్లో ఆయన మరణించారు. అప్పటికి మమతకు 17 ఏళ్లు. తమ్ముడు చాయ్‌ అమ్ముతూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ భారాన్ని పంచుకోవడానికి మమత ఉదయం కాసేపు పాలమ్మేవారు. కాలేజీలో చదువుకుంటూనే బడిలో పాఠాలు చెప్పేవారు.

15 ఏళ్ల వయస్సు నుంచే దీదీ కాంగ్రెస్‌ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనేవారు. ఆమె వాగ్దాటిని గ్రహించిన కాంగ్రెస్‌ నేతలు మమతను కోల్‌కతాకే పరిమితం చేయకుండా రాష్ట్రమంతటా బహిరంగ సభలకు తీసుకెళ్లేవారు. మమత రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే బెంగాల్‌లో కాంగ్రెస్‌ అధికారాన్నికోల్పోయింది. అప్పటి నుంచి 2011 వరకు బెంగాల్‌లో వామపక్షాలే అధికారంలో ఉన్నాయి. నామమాత్రంగా మారిన బెంగాల్‌ కాంగ్రెస్‌లో పోరాట పటిమ కనబరిచిన ఏకైక నేత మమతకు మంచి అవకాశాలు వచ్చాయి.

1984లో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిర హత్యానంతర సానుభూతి పవనాల్లో మమత సీపీఎం దిగ్గజం సోమనాథ్‌ ఛటర్జీని ఓడించి తొలిసారి ఎంపీ అయ్యారు. అప్పుడామె వయస్సు కేవలం 29 ఏళ్లు మాత్రమే. సభలో అతి పిన్న వయస్కురాలు ఆమే కావడం విశేషం.

► ఏ కుటుంబ వారసత్వం లేకుండా అంత చిన్న వయస్సులో ఎంపీ కావడం సామాన్య విషయం కాదు. రాజీవ్‌గాంధీ ఆమెను ప్రోత్సహించారు. మమత ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1991లో తిరిగి ఎంపీగా నెగ్గారు. అప్పటి నుంచి 2011లో సీఎం అయ్యే వరకు వరుసగా ఆరుసార్లు కోల్‌కతా దక్షిణ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు దీదీ. 

1991లో కాంగ్రెస్‌ సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి మెజారిటీ లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మమతకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అయితే, దిల్లీలో అవసరాల మేరకు కాంగ్రెస్‌ బెంగాల్‌ రాజకీయాల్లో ప్రతిపక్షంగా తన దూకుడు తగ్గించింది. ఇది మమతకు నచ్చలేదు. నరనరానా వామపక్షాల వ్యతిరేకతను జీర్ణించుకున్న ఆమెకు కాంగ్రెస్‌లో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆమె 1997లో సొంత పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు.

 

మమత అత్యంత నిరాడంబర జీవితం ఆమెను మధ్యతరగతికి దగ్గర చేసింది. రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా కోల్‌కతాలోని మధ్యతరగతి వీధిలోనే ఆమె నివాసం, సాధారణమైన కాటన్‌ చీరలు కడతారు. కాళ్లకు రబ్బరు చెప్పులు వేసుకుంటారు. మేకప్‌ వాడరు. ఆభరణాలు ధరించరు. అవివాహితురాలు. చేతికి ఉండే గుడ్డ సంచి మాత్రమే ఆమె లగేజీ, బ్యాగేజీ.

ఇస్లామిక్‌ చరిత్రలో పీజీ చేసిన దీదీ.. రాష్ట్రంలో 27శాతం ఉన్న ముస్లింల మనసులు గెలిచేందుకు ఎంతవరకైనా వెళ్లే ధోరణి ఆమెది. 
మమత పార్టీ పెట్టిన కొత్తలో ఆమె భాజపాతో జట్టుకట్టారు. అప్పుడు కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. దాంతో ఆమెకు భాజపా అండ కావాల్సి వచ్చింది. 1999లో మమత కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా చేరారు. అయితే, అది ముస్లిం ఓటర్లలో తృణమూల్‌ ఎదుగుదలకు ప్రతిబంధకమైంది. దాంతో ప్రభుత్వంలో ఉన్నా ముళ్లమీద కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. 

2001లో రక్షణ వ్యవహారాల కుంభకోణాన్ని తెహల్కా బయటపెట్టడంతో అదే అవకాశంగా తీసుకొని మమత ప్రభుత్వం నుంచి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌తో కలిసి బెంగాల్‌ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. వామపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు అండ కావాల్సి రావడంతో తిరిగి వాజ్‌పేయీ మంత్రివర్గంలో చేరారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ ఘోర పరాజయం చవిచూసింది. ఆమె ఒక్కరే నెగ్గారు.

2004-09 మధ్య కాలం మమతకు అత్యంత క్లిష్ట సమయం. బద్ధ శత్రువైన సీపీఎం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ -వామపక్షాలు వేరవడంతో మమతకు రొట్టెవిరిగి నేతిలో పడినట్టు అయింది. నమ్మకమైన మిత్రపక్షంగా ఉన్న భాజపాను కాదని కాంగ్రెస్‌తో జట్టుకట్టారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఘన విజయం అందుకున్నారు. ఆ తర్వాత బెంగాల్‌లో తృణమూల్‌ పాతుకుపోయింది. మిత్రపక్షాల అవసరమే లేకుండా సొంత కాళ్లపైనే నిలబడి అపూర్వ విజయాలను అందుకుంటోంది.

మమత రాజకీయ చరిత్రలో 2007లో జరిగిన సింగూరు, నందిగ్రామ్‌ పోరాటాలు ఆమెకు టర్నింగ్‌ పాయింట్‌. బుద్ధదేవ్‌ భట్టాచార్య ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల పేరుతో సారవంతమైన వ్యవసాయ భూములను బలవంతంగా తీసుకోవడం ఆమెకు బాగా కలిసివచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు ముఖ్యంగా ముస్లింలు దాదాపు సాయుధ తిరుగుబాటు స్థాయికి వెళ్లారు. మేధావి లోకం కలిసి వచ్చింది. ఉద్యమానికి దీదీ అండగా నిలవడం, ఆమరణ దీక్షకు దిగడంతో రాష్ట్ర ప్రజల్లో ఆమె ప్రతిష్ట బాగా పెరిగింది. ఆ తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలను చిత్తుగా ఓడించిన దీదీ.. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మార్క్సిస్టులకు అధికారం దూరం చేశారు. గత ఎన్నికల్లో ‘మా-మాటీ- మానుష్‌’ నినాదంతో బెంగాల్‌ ప్రజలకు దీదీ మానసికంగా దగ్గరైన ఆమె.. ఈ ఎన్నికల్లో ‘లోకల్‌’ నినాదంతో కమలనాథుల దూకుడుకు చెక్‌ పెట్టారు.

 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని