Vaccines: మంత్రులు పెరిగారు..కానీ, టీకాలు కాదు..!

తాజా వార్తలు

Published : 12/07/2021 01:10 IST

Vaccines: మంత్రులు పెరిగారు..కానీ, టీకాలు కాదు..!

కేంద్రం తీరుపై రాహుల్ గాంధీ విమర్శ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ అవుతున్న తీరుపట్ల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య పెరిగింది.. కానీ, వ్యాక్సిన్‌ల సంఖ్య పెరగలేదని విమర్శించారు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది డిసెంబర్‌ చివరినాటికి పెద్దవాళ్లందరికీ వ్యాక్సిన్‌ అందిస్తామన్న లక్ష్యాన్ని చేరడం కష్టమేనన్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రుల సంఖ్య 77కు పెరిగిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు.

‘మంత్రుల సంఖ్య పెరిగింది. కానీ, వ్యాక్సిన్‌ల సంఖ్య కాదు. ముఖ్యంగా డిసెంబర్‌ చివరినాటికి జనాభాలో 60శాతం మందికి వ్యాక్సిన్‌ అందించాలంటే.. ప్రస్తుతం వేగాన్ని బట్టి నిత్యం దాదాపు 88లక్షల డోసులను అందజేయాల్సి ఉంది. కానీ, గడిచిన వారం రోజులుగా సరాసరి 34లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇలా నిత్యం దాదాపు 54లక్షల కొరత ఏర్పడుతోంది’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఒక్కోరోజు 30లక్షల డోసులను మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. దేశంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందని చెబుతున్నా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోందని దుయ్యబట్టారు.

దేశంలో మూడో వేవ్‌ను అడ్డుకోవాలంటే దాదాపు నిత్యం 80 లక్షల నుంచి కోటి డోసులు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో రోజూ కోటి మందికి వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం ఉందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. కానీ, జులై నుంచి భారీ స్థాయిలో పంపిణీ చేయాలని నిర్దేశించుకున్నప్పటికీ ప్రస్తుతం నిత్యం 40లక్షల డోసులను మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. అయితే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగిస్తోందని.. ముఖ్యంగా టీకాలపై కాంగ్రెస్‌ అసత్య ప్రచారాలు చేయడం వల్లే ఇలా జరుగుతోందని భాజపా తిప్పికొడుతోంది. దేశంలో వ్యాక్సిన్‌ కొరత లేదని స్పష్టం చేస్తోంది.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 37కోట్ల 60లక్షల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 10వ తేదీన 37లక్షల డోసులను అందించినట్లు పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని