Rahul gandhi: రాహులే అధ్యక్షుడు కావాలి.. అందరి ఆకాంక్షా అదే!

తాజా వార్తలు

Published : 12/10/2021 16:20 IST

Rahul gandhi: రాహులే అధ్యక్షుడు కావాలి.. అందరి ఆకాంక్షా అదే!

డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

బెంగళూరు: ఈ నెల 16న సీడబ్ల్యూసీ భేటీ కానున్న వేళ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌ గాంధీ చేపట్టాలన్న నేతల ప్రకటనలు మళ్లీ మొదలయ్యాయి. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్నదే దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తల ఏకగ్రీవ స్వరమన్నారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీయే పార్టీ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన రాజీనామా చేసినప్పటినుంచి మేం ఒత్తిడి తెస్తున్నాం. రాహుల్ ఇప్పటికే 90శాతం మేర పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టాలని మేం కోరుకుంటున్నాం. అక్టోబర్‌ 16న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఉంది.. చూద్దాం’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలనే అభిప్రాయాన్ని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా నిన్న వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో పనిచేసేందుకు ఆయనకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా అవకాశం కల్పించినట్టు వచ్చిన ఊహాగానాలపై డీకే శివకుమార్‌ స్పందించారు. దీనిపై నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అలాంటి చర్చలేవీ రాష్ట్ర స్థాయిలో జరగలేదని స్పష్టంచేశారు. అనేకమంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కర్ణాటకలో బొగ్గు, విద్యుత్‌ కొరతపై సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో  విద్యుత్తు మిగులు ఉండేదని, ఇతరులకు కూడా విక్రయించినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరోవైపు, ఈ నెల 16న కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. లఖింపుర్‌ ఖేరీ హింస, తాజా రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత ఎన్నికలు ప్రధాన ఎజెండాగా ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక అంశంపై కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 2019లో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసినప్పటి నుంచి సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి అధ్యక్షుడు కావాలని పార్టీలో చాలా మంది డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో జూన్‌ నాటికి అధ్యక్ష ఎన్నిక పూర్తి చేయాలని నిర్ణయించినప్పటికీ కరోనా నేపథ్యంలో జరగలేదు. ప్రస్తుతం జరుగబోయే సీడబ్ల్యూసీ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారోననే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని