మోదీకి పాలించే నైతిక హక్కు లేదు: సిబల్‌
close

తాజా వార్తలు

Published : 19/06/2021 01:14 IST

మోదీకి పాలించే నైతిక హక్కు లేదు: సిబల్‌

దిల్లీ: దేశాన్ని పాలించే నైతిక హక్కును ప్రధాని మోదీ కోల్పోయారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ వేళ దేశ ప్రజలంతా వైద్య సాయంకోసం ఎదురు చూస్తుంటే ఆయన రాజకీయాల కోసం వెంపర్లాడారని దుయ్యబట్టారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు.

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సందర్భంగా ఆస్పత్రుల వద్ద పడిగాపులు కాస్తున్న ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రధాని.. పశ్చిమ్‌ బెంగాల్‌, అసాం వంటి రాష్ట్రాల రాజకీయాల్లో బిజీగా గడిపారని సిబల్‌ ఎద్దేవా చేశారు. అందుకే ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కూడా లేకుండా పోయిందని అంగీకరించారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో సంస్కరణలు తేవాల్సిన అవసరాన్ని తాను గుర్తు చేస్తున్నానని అన్నారు.

స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇతరులపై ఆ నెపాన్ని నెట్టేస్తోందని సిబల్‌ అన్నారు. తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘టూల్‌ కిట్‌’ అంశాన్ని సాధనంగా వాడుకుందని విమర్శించారు. తొలిదశ తర్వాత సెకండ్‌ వేవ్‌ వచ్చేనాటికి వైద్యపరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిని సైతం పెంచేందుకు కృషి చేయలేదని ఆరోపించారు. ప్రపంచమంతా వ్యాక్సినేషన్‌ గురించి ఆలోచన చేస్తే.. మోదీ ప్రభుత్వం 2021 జనవరి వరకు వ్యాక్సిన్లకు ఆర్డర్‌ పెట్టలేదన్నారు. వ్యాక్సిన్ల కొరతపై విమర్శలను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ప్రయత్నం చేసిందని సిబల్‌ ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని