విశాఖ తూర్పులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి

తాజా వార్తలు

Updated : 28/12/2020 00:48 IST

విశాఖ తూర్పులో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి

విశాఖపట్నం: విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో శనివారం నుంచి ఈ నియోజకవర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దేవుడిపై ప్రమాణాలు చేయాలని తెదేపా, వైకాపా నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. తాజాగా ఇవాళ విశాఖ ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ సాయిబాబా గుడికి వైకాపా వర్గీయులు రానున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్‌ నేతృత్వంతో ఆ పార్టీ నాయకులు సాయిబాబా గుడి వద్దకు చేరుకోనున్నట్లు సమాచారం. 

ఉదయం 11 గంటల నుంచి గంట పాటు సాయిబాబా గుడి వద్ద ఉంటామని గుడివాడ అమర్నాథ్‌ ఎమ్మెల్యే వెలగపూడికి సవాల్‌ విసిరారు. అదే సమయానికి ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయ వద్ద ఆ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి. నిన్న నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వెలగపూడి తాను సవాలు విసిరింది ఎంపీ విజయసాయిరెడ్డికి అని వివరించారు. తనపై చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే దేవుడిపై ప్రమాణం చేయాలని ఆయన ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్‌ విసిరారు. విజయసాయిరెడ్డి తన సవాలు స్వీకరించకుండా అందరితోనూ మాట్లాడిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి వస్తే సింహాచలం అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని ఎమ్మెల్యే వెలగపూడి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆలయానికి చేరుకుంటున్న వైకాపా శ్రేణులు..

గాజువాక మండలం నుంచి భారీ వాహన శ్రేణితో విశాఖ వచ్చిన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్‌ బీచ్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెలగపూడిపై విమర్శలు చేశారు. సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే దాగుడు మూతలాడుతున్నారని పేర్కొన్నారు. వెలగపూడి రామకృష్ణబాబు ఎన్నో అక్రమాలకు, భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా బాబా గుడికి వచ్చామని అమర్నాథ్‌ అన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తేనే వెలగపూడి ప్రమాణం చేస్తామనడం సరికాదని.. పార్టీ తరుఫున తాము వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆలయానికి రావాలని పేర్కొన్నారు. సవాల్‌ స్వీకరించకపోతే వెలగపూడి రాజకీయ సన్యాసం తీసుకుంటారా.? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు పహారా కాస్తున్నారు. 


 

ఇవీ చదవండి..
సింగర్‌ సునీత-రామ్‌ల ప్రీ వెడ్డింగ్‌ పార్టీ

కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని