ఆ సీడీ ఓ కుట్ర.. నేను అమాయకుడిని

తాజా వార్తలు

Published : 09/03/2021 14:28 IST

ఆ సీడీ ఓ కుట్ర.. నేను అమాయకుడిని

కర్ణాటక మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి

బెంగళూరు: తనపై వచ్చిన రాసలీలల ఆరోపణల్లో నిజం లేదంటూ కర్ణాటక మాజీ మంత్రి రమేశ్‌ జార్ఖిహొళి తాజాగా మరోమారు ఖండించారు. ఆ ఆరోపణలకు సంబంధించి విడుదలైన సీడీ గురించి తనకేం తెలియదని.. కావాలని ఎవరో కుట్ర చేస్తున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‘రాసలీలల వ్యవహారంలో నేను ఉన్నానని ఆరోపిస్తూ విడుదలైన సీడీలో నిజం లేదు. నేను అమాయకుడిని. అసలు ఈ సీడీ వ్యవహారం నాలుగు నెలల కిందటే నా దృష్టికి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదని అప్పుడే నా సోదరుడికి కూడా వివరించా. అందులో ఉన్నది నేను కాదు. ఈ విషయంలో న్యాయపరమైన సహకారం గురించి నాకు అధిష్ఠానం నుంచి కాల్‌ వచ్చింది. అయినప్పటికీ ఆ ఆరోపణలపై నేను ఒంటరిగా పోరాడగలనని చెప్పా’ అని రమేశ్‌ తెలిపారు.

‘మంత్రి పదవికి రాజీనామా చేయడం నా సొంత నిర్ణయమే. నన్ను రాజీనామా చేయమని సీఎం యడియూరప్ప కోరలేదు. నా అంతట నేనే రాజీనామా చేశా. నా వల్ల పార్టీ ఇబ్బందుల పాలు కావడం నాకు ఇష్టం లేదు. అందుకే తర్వాతి రోజు ఉదయమే రాజీనామా సమర్పించా’ అని రమేశ్‌ వెల్లడించారు.

కర్ణాటకకు చెందిన భాజపా నేత రమేశ్‌ జార్ఖిహొళి రాసలీలల ఆరోపణల్లో చిక్కుకుని మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నట్లు సహచట్టం కార్యకర్త ఒకరు బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి విడుదలైన ఓ సీడీలోని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడం సంచలనం సృష్టించింది. కాగా ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని