అన్నాడీఎంకే నాయకులకు పరిపక్వత లేదు: శశికళ

తాజా వార్తలు

Updated : 18/06/2021 01:39 IST

అన్నాడీఎంకే నాయకులకు పరిపక్వత లేదు: శశికళ

చెన్నై:  అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వీకే శశికళ మరోసారి ఆ పార్టీ నేతలపై అసమ్మతి స్వరం వినిపించారు. అన్నాడీఎంకే నేతలకు పరిపక్వత లేదంటూ ఎడప్పాడి నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తతో ఆమె ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేపు తాజాగా బయటికొచ్చింది.  దీంతో మళ్లీ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ టేపులో.. పార్టీ నాయకులు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ అమె విమర్శించారు. ప్రస్తుత నాయకులెవరూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ చూపిన మార్గంలో నడవడంలేదన్నారు. ఆయన బాటలో నడిచిన కార్యకర్తలు ఎప్పటికీ తప్పు చేయరని పేర్కొన్నారు.  ఎంజీఆర్‌, జయలలిత హయాంలో పార్టీకి అన్ని వర్గాల నుంచి ఓట్లు వచ్చాయని వివరించారు. వారు కుల మతాల ఆధారంగా పక్షపాతం చూపలేదన్నారు. కానీ ప్రస్తుతం కొందరు నాయకులు తమ వ్యవహారశైలితో పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని చూస్తుంటే ఆందోళనకు గురి కావాల్సి వస్తోందన్నారు. 

అన్నాడీఎంకేలో ఓ సామాజిక వర్గం ప్రాపకాన్ని పెంచేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ తనకు ఫిర్యాదులు అందినట్లు ఆమె గతంలో కార్యకర్తలతో ఫోన్‌లో సంభాషిస్తూ చెప్పారు. మరోవైపు ఎడప్పాడి నియోజకవర్గానికి  చెందిన పార్టీ నేతలు సమావేశమై శశికళకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. పార్టీలో అయోమయ పరిస్థితులను సృష్టించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారంటూ విల్లుపురం పార్టీ కమిటీ సైతం ఆమెకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. బ్రిటిష్‌ వారు అనుసరించిన ‘విభజించి పాలించు’ సూత్రాన్ని శశికళ పాటిస్తున్నారని.. కానీ ఆ విధానం పార్టీపై ఎలాంటి ప్రభావమూ చూపలేరని పార్టీ నేత డీ జయకుమార్‌ పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని