వైకాపా పతనం ప్రారంభమైంది: చంద్రబాబు

తాజా వార్తలు

Updated : 10/02/2021 17:50 IST

వైకాపా పతనం ప్రారంభమైంది: చంద్రబాబు

అమరావతి: ఏపీలో తాజాగా వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  వైకాపా పతనం ఇక్కణ్నుంచే ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. 20 నెలల పాలనలో అన్నీ ఉల్లంఘనలేనని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు. బుధవారం అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అమరావతి, పోలవరం, పెట్టుబడులను ధ్వంసం చేశారు. విద్వేషాలు, హింసతో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో హింసాకాండ, పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారు’ అని చంద్రబాబు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉంది

తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. ఎంత హింస పెట్టినా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. 38.74 శాతం ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. 94 శాతం వైకాపా గెలుచుకుందని గాలి కబుర్లు చెబుతారా? అరాచకాలు చేసేవారు ఫలితాలను చూసైనా మారాలి’ అని చంద్రబాబు అన్నారు. 

‘అచ్చెన్నాయుడిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసు బనాయించారు. వైకాపా నేతలు మాట్లాడితే మాత్రం పట్టించుకోరు. అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తారా.?పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు. తెలుగుదేశం పార్టీపై ఏకపక్షంగా కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడతారా.?అఖిల భారత సర్వీసు అధికారులను బెదిరిస్తారా?పార్టీ పెడుతున్నామని షర్మిల చెబుతుంటే.. ఏ2 మాత్రం లేదంటారా.? అని చంద్రబాబు ప్రశ్నించారు. 

తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టం

తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. అందరికీ గుణపాఠం చెబుతామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు అని అన్నారు. ఎస్‌ఈసీ చెబితే వినొద్దని మంత్రి పెద్దిరెడ్డి చెబుతారా.? అని ప్రశ్నించారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారని చెప్పారు. గెలిచిన పంచాయతీల్లో చాలాచోట్ల ఫలితం తారుమారు చేశారని ఆయన ఆరోపించారు. గెలుపోటములు సహజమని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలను మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని రణరంగంగా మార్చారని విమర్శించారు. 

ఇవీ చదవండి..
పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడొచ్చు: హైకోర్టు

కందరాడలో బ్యాలెట్‌ పత్రాల అపహరణ
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని