మరోసారి తెరపైకి బాక్సైట్‌ వివాదం

తాజా వార్తలు

Updated : 09/07/2021 17:25 IST

మరోసారి తెరపైకి బాక్సైట్‌ వివాదం

రౌతులపూడిలో తెదేపా బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

రౌతులపూడి: తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడిలో తెదేపా బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ మన్యంలో లేటరైట్‌ తవ్వకాలను పరిశీలించేందుకు తెదేపా నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్‌, అనిత, ఈశ్వరి, రాజేశ్వరీ, మాజీ ఎమ్మెల్సీ సంధ్యారాణిలతో కూడిన బృందం గిరిజనులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. రౌతులపూడి మండలం జల్దామ్‌ నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ జరిగినట్లు గర్తించిన తెదేపా నేతలు.. కేవలం లేటరైట్‌ తరలింపునకే రోడ్డు వేశారని ఆరోపించారు. రోడ్డు విస్తరణలో తమ పొలాలు, చెట్లు పోయాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు జగన్‌ ప్రభుత్వం మరోసారి తెరలేపిందన్నారు. రిజర్వు ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేశారన్నారు.

గిరిజనులతో మాట్లాడిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న తెదేపా నేతలను తూర్పు గోదావరి జిల్లా దబ్బాలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంతో అక్కడే నిరసనకు దిగారు. రెండు గంటలకుపైగా మీడియా ప్రతినిధులు, తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతుండగా.. మీడియాతో మాట్లాడిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తామని నేతలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలన్నారు. అక్రమ మైనింగ్ ఆపి గిరిజనుల సంపదను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రౌతులపూడి ఘటనపై అయ్యన్నపాత్రుడు, చినరాజప్పతో పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. గిరిజన భూములు, అటవీ భూముల్లోనూ రోడ్లు వేసిన వైనంపై ఆరా తీశారు. మూడున్నర గంటల తర్వాత తెదేపా నేతలు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి నేతలను కోటనందురు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని