AP News: ఏపీ వ్యాప్తంగా తెదేపా నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు

తాజా వార్తలు

Updated : 20/10/2021 13:23 IST

AP News: ఏపీ వ్యాప్తంగా తెదేపా నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు

అమరావతి:  తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌పై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం నేతలను  పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తెదేపా నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. 

బంద్‌ పిలుపు నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలాస ఆర్టీసీ డిపో వద్ద తెదేపా నాయకులు ఆందోళన చేపట్టగా వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాజాంలో ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించి ఆయన్ను గృహనిర్బంధం చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలువురు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సాలూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తెదేపా శ్రేణులు నిలిపేశాయి. విశాఖ జిల్లాలోనూ పలువురు తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్‌తో పాటు 10 మంది తెదేపా నేతలను అరెస్ట్‌ చేశారు. తెదేపా కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోనూ నిరసనలు కొనసాగాయి. పాడేరులో ఆందోళనకు దిగిన తెదేపా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును గృహనిర్బంధం చేశారు. ఏలూరులో తెదేపా నేత బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం బస్టాండ్‌ వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెడనలో తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కాగిత కృష్ణప్రసాద్‌ను గృహనిర్బంధం చేశారు. విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులను గృహనిర్బంధం చేశారు.  గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడ బస్టాండ్‌ వద్ద టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో నేతలు నిరసన తెలిపారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా చింతమనేని తన వాహనంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పోలీసులు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. 

తెదేపా నేతల నిరసనల నేపథ్యంలో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద పోలీసులు మోహరించారు. వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద బస్సులను తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో పలువురు కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నరసరావుపేటలో తెదేపా శ్రేణులు ర్యాలీ చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అరవిందబాబును అరెస్ట్‌ చేసి ఆయన్ను శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద తెదేపా కార్యకర్తలు, నేతలు నిరసన తెలిపారు. బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు. మార్కాపురం డిపో ఎదుట తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు కదలకుండా గేటు ముందు బైఠాయించారు. నెల్లూరు జిల్లాలోనూ తెదేపా నేతలు ఆందోళనలు కొనసాగించారు. నెల్లూరు-కడప జాతీయ రహదారిపై నేతలు బైఠాయించారు. దీంతో ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేపడుతున్న పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

రాయలసీమ జిల్లాల్లోనూ ఆందోళనలు, నిరసనలు కొనసాగాయి. చిత్తూరు జిల్లాలో పలుచోట్ల తెదేపా నేతలను గృహనిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నరసింహ యాదవ్‌ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుమల వచ్చే యాత్రికులకు అసౌకర్యం కలిగించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా రాజంపేటలో బస్సులను అడ్డుకున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైదుకూరులో తితిదే మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు. తెదేపా ఆందోళనల నేపథ్యంలో కడప ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సహా ఆ పార్టీ నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్‌, లింగారెడ్డి, పుత్తా నరసింహారెడ్డిలను గృహనిర్బంధం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మంత్రాలయం తెదేపా ఇన్‌ఛార్జ్‌ తిక్కారెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, కర్నూలులో తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డోన్‌లో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కేఈ ప్రభాకర్‌, నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్‌, బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిలను పోలీసులు గృనిర్బంధం చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలువురు తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. గుంతకల్లులో జితేంద్రగౌడ్‌ను గృహనిర్బంధం చేశారు.






Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని