కేజ్రీవాల్‌ నియంత: మాజీ ఆప్‌ ఎమ్మెల్యే

తాజా వార్తలు

Published : 04/06/2021 19:23 IST

కేజ్రీవాల్‌ నియంత: మాజీ ఆప్‌ ఎమ్మెల్యే

ఛండీగడ్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరి తప్పు చేశానని పంజాబ్‌లోని బోలత్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ కైరా అన్నారు. గురువారం సుఖ్‌పాల్‌తోపాటు మరో ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పంజాబ్‌ సీఎం అమరీందర్ సింగ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సుఖ్‌పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఆప్‌ పార్టీలో అరాచకాలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘2015లో ఆప్‌లో చేరి తప్పు చేశా. భారత రాజకీయాల్లో కేజ్రీవాల్‌ గుణాత్మక మార్పులు తెస్తారని భావించా. కానీ ఆయనతో పని చేశాక తెలిసింది అతడో కపటదారి అని. పార్టీలో ఆయన నియంతలా వ్యవహరిస్తారు. భాజపాకు బీ-టీమ్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌ను ధ్వంసం చేయడంలో భాజపాకు మద్దతిచ్చారు. సమాఖ్యవాద స్ఫూర్తికి, మైనార్టీలకు వ్యతిరేకంగా ఆయన భావజాలం ఉంటుంది’’ అని సుఖ్‌పాల్‌ సింగ్‌ అన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఆప్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అభిప్రాయ భేదాలతో 2019లోనే ఆయన ఆప్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరారు. 

2017లో పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 117 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఆప్‌ పార్టీ 112 చోట్ల పోటీ చేసి, 20 స్థానాలు దక్కించుకుంది. పోలైన ఓట్లలో 23.7 శాతం పొందింది. కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లోనూ పోటీ చేసి 77 స్థానాల్లో గెలుపొంది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆప్‌ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్‌ బలం మరింత పెరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని