జమ్మలమడుగులో పంచాయితీల్లేని ‘పంచాయతీ’

తాజా వార్తలు

Published : 05/02/2021 02:17 IST

జమ్మలమడుగులో పంచాయితీల్లేని ‘పంచాయతీ’

40 ఏళ్లుగా ‘పంచాయతీ’ ఏకగ్రీవమే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ ఊరు ఎన్నో పంచాయతీ ఎన్నికలు చూసింది. ఎంతో మంది సర్పంచుల్ని ఎన్నుకుంది. కానీ పల్లె పోరులో ఒక్కరూ ఓటు వేయలేదు. ఒకట్రెండు కాదు నాలుగు దశాబ్దాలుగా అక్కడ ఇదే ఆనవాయితీ. పార్టీలుండవ్‌.. పంతాలుండవ్‌.. కేసులుండవ్‌.. కొట్లాటలుండవ్‌. అంతా ఒకే మాట.. ఒకటే బాట. అందుకే 40 ఏళ్లుగా ఆ పంచాయతీ సామరస్య ఏకగ్రీవానికి చిరునామాగా నిలుస్తోంది. 

కడప జిల్లా జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్‌ గుర్తొస్తుంది. ఇక ఎన్నికల సమయంలో చెప్పేదేముంది? ఘర్షణలు, గొడవలు సహజం. అలాంటి జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాన్ని పక్కనపడేసే ఓ ఊరుంది. అదే శేషారెడ్డిపల్లె. దీన్నే రాళ్లగుండ్లకుంట అని కూడా పిలుస్తారు. జమ్మలమడుగు పట్టణానికి ఐదు కి.మీల దూరంలో ఉంటుందీ పల్లె. ఇక్కడ 369 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 185 పురుష ఓటర్లు కాగా.. 184మంది మహిళలు ఉన్నారు. కానీ గత 40 ఏళ్లలో ఒక్కరు కూడా సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు వేయలేదు. ఎందుకని ప్రశ్నిస్తే ఆ అవసరం ఏముందని గ్రామస్థులు ఎదురుప్రశ్న వేస్తారు. 
ఎందుకంటే ఈ పంచాయతీలో ఎన్నికలపై రాజకీయ క్రీనీడ ఉండదు. ఊరంతా ఏకతాటిపై ఉంటుంది. ఎవరో ఒకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటుంది.  40 ఏళ్లుగా ఆ గ్రామానికి సర్పంచులుగా పనిచేసినవారంతా అలా ఎన్నికైనవారే. పంతాలకంటే ప్రశాంతతే ముఖ్యమన్నది ఆ గ్రామస్థుల సిద్ధాంతం. 

 

2001 ఆగస్టులో సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. 1961లో నేను పుట్టాను. నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక ఎఫ్‌ఐఆర్‌ గానీ, కేసుగానీ, సివిల్‌కేసు గానీ లేవు. కల్లు అంగడి, సారా అంగడి గానీ లేవు. ఏదైనా జరిగినా, చిన్నచిన్న తగాదాలు ఉన్నా అందరం కలిసి పరిష్కరించుకుంటాం. మాలో మేమే సర్దిచెప్పుకొంటాం. అందుకే ఎలాంటి కలతలు లేకుండా సాగుతున్నాం.- మాజీ సర్పంచ్‌

పంచాయతీలు పెట్టుకోని శేషారెడ్డిపల్లెకి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్‌. చెడు వ్యసనాలను పొలిమేర దాటి ఊళ్లోకి రానివ్వరు అక్కడి ప్రజలు. మద్యం సేవించరు. ధూమపానానికి దూరంగా ఉంటారు. అందుకే ఈ గ్రామం  ఇంతవరకు పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కలేదు. శేషారెడ్డిపల్లె పంచాయతీ ఈసారి జనరల్‌ మహిళకు దక్కింది. అంతా కూర్చొని ఒకరిని ఎన్నుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు గ్రామస్థులు.

 

ఈ గ్రామంలో సుమారు 80 కుటుంబాలు ఉన్నాయి. ఎన్నికలకు సంబంధించి రికార్డులు పరిశీలిస్తే.. గతంలో సుగమంచిపల్లి పంచాయతీ కింద ఉండేది. దీన్ని పంచాయతీగా చేసిన తర్వాత ఇప్పటిదాకా ఎన్నికలు జరగలేదు. ఎప్పుడూ అందరూ కూర్చొని ఏకగ్రీవంగా ఎన్నుకొంటున్నారు. అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చాలా మందిలో రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ అనే అపోహలు ఉన్నాయి. ఇలాంటి చోట కూడా మద్యపానం గానీ, ధూమపానం గానీ అలవాటు లేకుండా సత్ప్రవర్తనతో మెలుగుతున్న ఈ గ్రామ ప్రజలకు పోలీస్‌శాఖ తరఫున ధన్యవాదాలు.- జమ్మలమడుగు సీఐAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని