Kanhaiya Kumar: కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?

తాజా వార్తలు

Updated : 17/09/2021 12:46 IST

Kanhaiya Kumar: కన్నయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?

దిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్‌ ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలవడంపై అనేక ఊహాగానాలు వినబడుతున్నాయి. ఆయన కాంగ్రెస్‌లో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరందుకుంది. అనేకమంది నేతలు రాహుల్‌ గాంధీని కలుస్తున్నారని, పలు అంశాలపై చర్చిస్తున్నారంటూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, ఈ ఊహాగానాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని.. ఏదైనా ఉంటే కచ్చితంగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు. మరోవైపు, బిహార్‌ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత కన్నయ్య ఆ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

సీపీఐలో ఇమడలేకపోతున్నారా?

ప్రస్తుతం సీపీఐ నేతగా కొనసాగుతున్న కన్నయ్య కుమార్‌ గతంలో జేఎన్‌యూ విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసి దేశద్రోహం కేసులో కింద అరెస్టయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని బెగుసరాయి స్థానం నుంచి భాజపా నేత గిరిరాజ్‌ సింగ్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే, కన్నయ్య సీపీఐలో ఇమడలేకపోతున్నారని, మంగళవారం రాహుల్‌ గాంధీని కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశంపై చర్చించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. కన్నయ్య పార్టీని వీడే అవకాశంపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందిస్తూ.. దీనిపై ఊహాగానాలు వినబడుతున్నాయన్నారు. ఇటీవల తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారని, చర్చల్లో కూడా పాల్గొన్నారని తెలిపారు. 

కాంగ్రెస్‌తో టచ్‌లో జిగ్నేశ్‌ మేవానీ!

గత రెండేళ్ల కాలంలో జ్యోతిరాదిత్య సింథియా, సుస్మితా దేవ్‌, జితిన్‌ ప్రసాద, ప్రియాంక చతుర్వేది వంటి కీలక యువ నేతలు కాంగ్రెస్‌ను వీడిన నేపథ్యంలో కొత్త నాయకత్వాన్ని చేర్చుకొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో 2025 బిహార్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కన్నయ్య కుమార్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, కాంగ్రెస్‌లో తగిన స్థానం కల్పించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ కూడా కాంగ్రెస్‌ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బనస్కాంత జిల్లాలోని వాద్గామ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. అక్కడ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని బరిలో నిలపకుండా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

యువ నేతలతో బలపడొచ్చని కాంగ్రెస్‌ అంచనా!

బిహార్‌లో గత మూడు దశాబ్దాల కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌.. గతేడాది జరిగిన ఎన్నికల్లోనూ ఆర్జేడీ-వామపక్షాలతో కలిసి పోటీచేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మిత్రపక్షాలైన ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌)తో పోల్చి చూసినా మెరుగైన పనితీరును కనబరచలేకపోయింది. బిహార్‌ ఎన్నికల్లో 70 స్థానాల్లో పోటీచేసిన ‘హస్తం’ పార్టీ కేవలం 19 చోట్ల మాత్రమే గెలుపొందింది. 144 స్థానాల్గో పోటీ చేసిన ఆర్జేడీ సగానికి పైగా సీట్లు గెలుచుకోగా.. 19 స్థానాల్లో బరిలో నిలిచిన సీపీఐ(ఎంఎల్‌) 12 చోట్ల విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో కన్నయ్యకుమార్‌, జిగ్నేశ్‌ మేవానీ వంటి యువ నేతలు వస్తే ఆయా చోట్ల తమ పార్టీ బలపడుతుందని కాంగ్రెస్‌ విశ్వసిస్తున్నట్టు సమాచారం. 

ప్రచారంలో దించేలా కాంగ్రెస్‌ వ్యూహం!

అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం కలిగిన కన్నయ్య కుమార్‌ తమ పార్టీలో చేరితే ఉపయోగకరమని భావిస్తోన్న కాంగ్రెస్‌.. ఆయన్ను వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారానికి వినియోగించుకోవాలని చూస్త్తున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో  సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసే అవకాశం లేదని తేల్చి చెబుతుండటంతో ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్‌ పార్టీ.. పూర్వాంచల్‌ ప్రాంతంలో కన్నయ్యకుమార్‌ను ప్రచారానికి వినియోగించే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని