పోలీసులు నన్ను కొట్టారు: రఘురామ ఫిర్యాదు!

తాజా వార్తలు

Updated : 15/05/2021 19:24 IST

పోలీసులు నన్ను కొట్టారు: రఘురామ ఫిర్యాదు!

గుంటూరు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్‌ రిపోర్టును జడ్జికి అందజేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దుచేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించినట్టు సమాచారం. అయితే, రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్య సాయం కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని, నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేసినట్టు సమాచారం. అలాగే, ఆయన కాలికి గాయాలు కావడంపై హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేసినట్టు తెలిపారు.

ఎంపీని ఆస్పత్రికి తరలించాలన్న కోర్టు!

రఘురామ రిమాండ్‌ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఆయన అరికాళ్లపై గాయాలు, తదితర వివరాలను కోర్టు నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు ఆయన నిరాకరించడంతో.. రఘురామకు రమేశ్‌ ఆస్పత్రిలోచికిత్స చేయించాలని జడ్జి ఆదేశించారు. ఎంపీ కాలిగాయాలు చూసి రిమాండ్‌ రిపోర్టును న్యాయమూర్తి తిరస్కరించినట్టు సమాచారం. ఎంపీ రఘురామను వెంటనే మెడికల్‌ బోర్డుతో పరీక్ష చేయించాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్‌ కోర్టు రికార్డు స్టేట్‌మెంట్‌ను తక్షణమే హైకోర్టు ముందు ఉంచాలని సూచించింది. 

లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్తాం..

మరోవైపు, ఈ అంశాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లనున్నట్టు రఘురామ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ అంశంపై హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలైంది. దీంతో అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు, ఇప్పటికే రఘురామ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కింది కోర్టులోనే బెయిల్‌ కోసం సంప్రదించాలని సూచించింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేసి సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని