close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఫ్లెక్సీల వివాదంలో భాజపా కార్యకర్తలపై లాఠీఛార్జి

 నేడు జనగామకు బండి సంజయ్‌

జనగామ, భీమదేవరపల్లి, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కమిషనర్‌ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని ఆరోపిస్తూ ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటన మంగళవారం జనగామలో చోటుచేసుకుంది. స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో మంగళవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. దీనిపై భాజపా పట్టణ అధ్యక్షుడు పవన్‌శర్మ ఆధ్వర్యంలో యువ మోర్చా నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య వివరణ కోరేందుకు కార్యాలయానికి వచ్చారు. కాగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆరోపిస్తూ వారు కార్యాలయం ఎదుట ధర్నాకు ఉపక్రమించారు. ఈ సమయంలో కమిషనర్‌ సమ్మయ్య సీఐ మల్లేశ్‌యాదవ్‌, జేసీలకు ఫోన్‌చేశారు. తనపై దాడి జరుగుతుందన్న రీతిలో ఆయన అధికారులకు ఫోన్‌ చేయడంతో పోలీసులు హుటాహుటిన వచ్చి పవన్‌శర్మ తదితరులపై లాఠీ ఝుళిపించారు. పోలీసులు తమపై అమానుషంగా దాడి చేశారని పవన్‌శర్మ ఆరోపించారు. ఈ ఘటనపై కమిషనర్‌ సమ్మయ్యను వివరణ కోరగా ఉన్నతాధికారులు వస్తున్నందున ఫ్లెక్సీలు తొలగించామని, తనపై దాడి జరుగుతున్నట్లు పోలీసులకు చెప్పలేదన్నారు.
పోలీసులపై చర్య తీసుకోవాలి: సంజయ్‌
లాఠీఛార్జీ ఘటనకు కారకులైన పోలీసులను సస్పెండ్‌ చేయాలని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కొత్తకొండలో విలేకరులతో మాట్లాడారు. బాధితులను పరామర్శించేందుకు బుధవారం జనగామకు వెళ్తున్నట్లు తెలిపారు. సీఐ మల్లేష్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. లాఠీఛార్జి దృశ్యాలు మాధ్యమాల్లో చక్కర్లు కొట్టినా సీఎం స్పందించలేదన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు