భాజపాకు మోత్కుపల్లి రాజీనామా

ప్రధానాంశాలు

భాజపాకు మోత్కుపల్లి రాజీనామా

ఈటల అవినీతిపరుడు, కబ్జాదారు
పేదల గుండెల్లో అంబేడ్కర్‌కు వారసుడు కేసీఆర్‌
దళిత బంధుకు మద్దతుగా పార్టీ వీడుతున్నా: నర్సింహులు

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి, సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు. పార్టీని వీడుతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు శుక్రవారం లేఖ రాశారు. తన రాజీనామాకు కారణాల్ని అందులో వివరించారు. ‘‘భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న ఈటల రాజేందర్‌ నుంచి వివరణ కూడా తీసుకోకుండా పార్టీలోకి చేర్చుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాకు కనీసం భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించలేదు. ఇవన్నీ చాలా బాధ కలిగించాయి’’ అని వివరించారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తారన్న నమ్మకం ఉంది. పేదల గుండెల్లో ఆయన అంబేడ్కర్‌ వారసుడిగా మిగిలిపోతారు. ఈ పథకానికి మద్దతుగా భాజపాను వీడుతున్నా’’ అని ప్రకటించారు. దళితులు భాజపాకు దూరంగా ఉన్నారని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దళిత సాధికారత అఖిలపక్షానికి హాజరుకావాలని తాను, ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పినప్పటికీ బండి సంజయ్‌ వినలేదని ఆక్షేపించారు.   ‘‘పేదలకు, దళితులకు భాజపాలో గౌరవం లేదు. దళిత నేతనైన నన్ను భాజపా గౌరవించలేదు. పార్టీ సమావేశాల్లో వేదికపైకి పిలిచేవారు కాదు. బయట పార్టీలను వీడి చేరిన వారెవరూ భాజపాలో ఉండరు. ఇక ఆ పార్టీలోకి ఎవరూ వెళ్లరు. మాజీమంత్రి ఈటల పేదల, ఆలయ భూములు ఆక్రమించుకున్న భూకబ్జాదారు. అవినీతిపరుడు. దళితులంతా ఏకమై హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌కు మద్దతు పలకాలి. భూముల కబ్జా విషయంలో ఈటల పొరపాట్లను సరిచేయకపోగా వెనకేసుకు రావాల్సిన అవసరం భాజపాకేంటి? ఆయన 700 ఎకరాల భూముల, రూ.వేల కోట్లు ఎలా సంపాదించారు’ అని నర్సింహులు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని