Mirabai Chanu: ఆ మనస్తత్వమే రజత పతకం ముద్దాడేలా చేసింది!

తాజా వార్తలు

Updated : 24/07/2021 20:25 IST

Mirabai Chanu: ఆ మనస్తత్వమే రజత పతకం ముద్దాడేలా చేసింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి ప్రపంచ యౌవనికపై భారతదేశ కీర్తి జెండాను రెపరెపలాడించారు మణిపూర్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్‌ మీరాబాయి చాను. ఆమె సాధించిన అపూర్వ విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో ఎదురైన ఓటమినే విజయ సోపానాలుగా మార్చుకున్న వైనం అసాధారణమైనది. పట్టుదల, కఠోర సాధన కలబోతతో టోక్యో ఒలింపిక్స్‌లో కదన రంగంలోకి దూకి అద్భుతమైన ప్రదర్శనతో అందరితో భళా అనిపించుకున్నారు. ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన సాయికోమ్‌ మీరాబాయి చాను ఈ ఆనంద క్షణాల వెనుక ఐదేళ్ల కష్టం, కృషి దాగి ఉన్నాయి. 

ఐదేళ్లలో 5 రోజులే ఇంటి దగ్గర..  

రియో ఒలింపిక్స్‌లో కృషి చేసినప్పటికీ ఎదురైన ఓటమి మీరాబాయి చానును ఎంతగానో కుంగదీసినా వెనకడుగు వేయలేదు. ఆశలు వదులుకోలేదు. నిరంతరం కఠోర శ్రమ, కుటుంబం అండతో మరింత బలశాలిగా మారారు. టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగి చివరకు రజత పతకంతో ఛాంపియన్‌గా అవతరించారు. చిన్నప్పుడే టీవీల్లో క్రీడాకారుల ప్రదర్శనలు చూసి తానూ విజయవంతమైన ఓ క్రీడాకారిణి కావాలని అనుకునేదట. ఇతరులు చేయగలిగింది నేనెందుకు చేయలేను? అన్న పట్టుదలే మీరాబాయి చానును గెలుపు తీరాలకు చేర్చిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ‘రియో ఒలింపిక్స్‌లో ఓటమి చెందినప్పుడే నిర్ణయించుకున్నా.. నేనేంటో టోక్యోలో నిరూపించుకోవాలని అని మీరాబాయి చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ‘ఐదేళ్లలో ఐదు రోజులు మాత్రమే ఇంటిదగ్గర ఉన్నా. ఇప్పుడు ఈ పతకంతో ఊళ్లో అడుగుపెడతా’ అంటూ రజత పతకం సాధించాక మీడియాతో చెప్పిన మాటలే చాను పట్టుదలకు, మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. 

ఇష్టమైన ఆహారం ఇదే..

మీరాబాయి చాను కూరగాయలు ఎక్కువగా తింటారట. పండ్ల రసాలంటే ఆమెకు అమితమైన ఇష్టం. వీటితో పాటు మణిపూర్‌ వంటకం కంగోసి కూడా ఎంతో ఇష్టమని పలుమార్లు ఆమె గత ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. పండ్లు తెచ్చుకొనేందుకు, కలప కోసం ఆమె అడవికి వెళ్తుండేవారట. ఆమె ఎప్పుడూ శక్తిమంతంగా ఉండేవారని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే ఆమెది పెద్ద మనసని, ఎవరైనా కలపను మోయలేకపోతే ఆమె ఎత్తుకొనేదట. ‘నువ్వు ఇప్పుడు వెయిట్‌ లిఫ్టర్‌వి కదా మా కలప కూడా నువ్వే మోయాలి’ అని అంటుండేవారని ఈ శుభసందర్భంలో గుర్తుచేసుకుంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. 

ఇంట్లో సంబరాలు

మరోవైపు, ఈ చరిత్రాత్మక క్షణంతో మీరా కుటుంబం సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆనందసాగరంలో మునిగిపోయారు. ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. తన కుటుంబంలోని ఆరుగురు సంతానంలో అందరికన్నా చిన్నదైన మీరాబాయి చాను సాధించిన ఈ అపూర్వ విజయానికి అంతా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఆమె చిన్నప్పుడు అడవి నుంచి కట్టెలను మోసుకొచ్చిన సందర్భాలను గుర్తుచేసుకుంటున్నారు. చానుకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలో!

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం తెస్తుందని తామంతా భావించినా దేశానికి వెండి పతకం తెచ్చిపెట్టినందుకు గర్వపడుతున్నామని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. తమ గారాలపట్టి ఊరికి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని, ఎలా సర్‌ప్రైజ్‌ చేయాలో ప్లాన్‌ చేస్తున్నట్టు చెబుతున్నారు. తమ ఇంటి బిడ్డ భారతదేశానికి, మణిపూర్‌కు గర్వకారణంగా నిలిచిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు.

నా కల సాకరమైన వేళ..

‘చివరకు నా కల సాకారమైంది..’ అని పేర్కొంటూ మీరా ట్వీట్‌ చేశారు. తాను సాధించిన రజత పతకాన్ని ముద్దాడుతున్న ఫొటోను షేర్‌ చేశారు. అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో ‘నేను సాధించిన ఈ పతకాన్ని దేశానికి అంకితం చేస్తున్నా. ఈ ప్రయాణంలో నాతో ఉండి నా గెలుపుకోసం ప్రార్థించిన కోట్లాది భారత ప్రజలకు కృతజ్ఞతలు. నా కుటుంబం, ప్రత్యేకించి మా అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు చెబుతున్నా. నన్ను ఇంతలా ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని