close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 03/06/2020 15:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాండ్యను బిడ్డలా ఆదరించిన పాంటింగ్‌

వెన్నెముక చికిత్సతో టెస్టుల్లో ఆడటం సవాలే

ఇతరుల సలహాలు పాటించి భంగపడ్డాను

ముంబయి: వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడటం ఇకపై సవాలేనని టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య భావిస్తున్నాడు. ఇక తాను పొట్టి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాడు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ వివాదంతో ఏకాగ్రత చెదిరిపోయిందని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌ మాజీ కోచ్‌ రికీ పాంటింగ్‌ తనను కొడుకులా ఆదరించారని గుర్తుచేసుకున్నాడు. 

ఇప్పటి వరకు హార్దిక్‌ పాండ్య 11 టెస్టులు ఆడాడు. 2018, సెప్టెంబర్‌ తర్వాత మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడలేదు. భారీ షాట్లు ఆడగలిగే సత్తా ఉండటంతో పొట్టి క్రికెట్లో కీలక సభ్యుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ‘సుదీర్ఘ ఫార్మాట్లో నన్ను బ్యాకప్‌ పేసర్‌గా భావిస్తారని తెలుసు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడటం సవాలే. ఒకవేళ నేను కేవలం ఆ ఫార్మాటే ఆడేవాడినైతే రిస్క్‌ చేయక తప్పదు. అయితే తెలుపు బంతి క్రికెట్‌ ప్రాముఖ్యం నాకు తెలుసు’ అని పాండ్య పేర్కొన్నాడు.

వెన్నునొప్పితో మైదానంలో విలవిల్లాడినప్పుడు తన కెరీర్‌ ముగిసిందనే హార్దిక్‌ భావించాడు. ‘నిజాయితీగా చెబుతున్నా. ఆ వెన్నునొప్పితో నా కెరీర్‌ అంతమైందని అనుకున్నా. దాదాపు 10 నిమిషాలు కదల్లేకపోయా. తర్వాతా ఆ నొప్పి నన్ను వదల్లేదు. కొన్ని రోజుల తర్వాత కోలుకోవడం మొదలైంది. గాయం కాకమునుపే విశ్రాంతినివ్వడంతో ఆసియాకప్‌ ఆఖరిదిగా భావించా’ అని పాండ్య వివరించాడు.

కరణ్‌ షోలో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పాండ్య స్పందించాడు. ఆ ఘటన తనకెన్నో విలువైన పాఠాలు నేర్పించిందని తెలిపాడు. ‘ఆ తర్వాత నేను మరింత వివేకవంతంగా మారాను. జీవితంలో నేనెన్నో తప్పులు చేశాను. వాటిని నిజాయతీగా అంగీకరించడం నాలోని ఒక సద్గుణం. నేను ఆ తప్పును అంగీకరించకపోతే టీవీలో నా గురించి మరో షో వచ్చేది. నా కుటుంబం మద్దతుతో ధైర్యంగా ఉన్నా. అయితే, నా వల్ల కుటుంబ సభ్యులకు చెడ్డపేరు రావడమే ఎంతో బాధ కలిగించింది’ అని అతడు చెప్పాడు.

వివాదం తర్వాత బయటవారి అభిప్రాయాలు వినడంతో ఇబ్బంది పడ్డానని పాండ్య తెలిపాడు. ‘2016 ఐపీఎల్‌ బాగా ఆడలేదు. కరణ్‌ షోతో ఏకాగ్రత చెదిరింది. 2015లో నేను విజయవంతం అయ్యాను. 2016లో ఇతరుల సలహాలు వినడంతో సమస్య వచ్చింది. నిశ్శబ్దంగా ఉండాలి, జనాలతో పద్ధతిగా నడుచుకోవాలి వంటి సలహాలు విన్నాను. హెయిర్‌ స్టైల్‌ జోలికి పోలేదు. ఇవన్నీ నా ఆటను దెబ్బతీశాయి. ఆ తర్వాత నా నియంత్రణలో లేని అంశాలపై దృష్టి సారించొద్దని నిర్ణయించుకున్నా’ అని హార్దిక్‌ అన్నాడు.

ముంబయి ఇండియన్స్‌ మాజీ కోచ్‌ రికీ పాంటింగ్‌ తనను బిడ్డలా ఆదరించారని పాండ్య గుర్తుచేసుకున్నాడు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు. పరిస్థితులు, మనస్తత్వాల గురించి ఆయన చక్కగా వివరించేవారని వెల్లడించాడు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు వరకు తన పక్కనే కూర్చొనేవారని తెలిపాడు. ఫీల్డింగ్‌ చేస్తుంటే బౌండరీ వద్ద ఉండి రికీని పిలిచి మాట్లాడితే మ్యాచులో ఏం జరుగుతుందో చెప్పేవారన్నాడు. ఆయన సలహాలతో ఎన్నో విషయాలను త్వరగా నేర్చుకున్నానని హార్దిక్‌ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.