
తాజా వార్తలు
నాలుగో టెస్టుకు దూరమైన పకోస్కీ
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియాతో ఆడే నాలుగో టెస్టుకు ఆస్ట్రేలియా యువ ఓపెనర్ విల్ పకోస్కీ దూరమయ్యాడు. అతడి స్థానంలో మార్కస్ హారిస్ తుది జట్టులో చేరాడు. ఈ విషయాన్ని ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేసింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్టు ఐదో రోజు పకోస్కీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. ఓ బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్‌చేస్తూ కింద పడ్డాడు. దీంతో కుడి భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే పకోస్కీ నాలుగో టెస్టుకు సాధన చేయడం లేదని, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టులో ఆడట్లేదని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ తాజాగా పేర్కొన్నాడు.
కాగా, పకోస్కీ సిడ్నీ టెస్టుతోనే అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. అదే అతడికి తొలి టెస్టు. వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన పకోస్కీ తొలి ఇన్నింగ్స్‌లో అర్ధశతకం(62) సాధించగా రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటయ్యాడు. మరోపక్క హారిస్ 2019 యాషెస్ సిరీస్‌లో ఆడాడు. అప్పుడు బాన్‌క్రాఫ్ట్‌కు బదులుగా మధ్యలో తుది జట్టులో చేరిన అతడు ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 58 పరుగులే చేశాడు. ఇప్పుడతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, దేశవాళీ క్రికెట్లో బాగా రాణించాడని పైన్ పేర్కొన్నాడు. అందుకే టీమ్ఇండియాతో చివరి టెస్టు తుది జట్టులో అతడిని ఎంపిక చేశామన్నాడు. ఇదిలా ఉండగా, ఇప్పటికే భారత్-ఆస్ట్రేలియా చెరో టెస్టు గెలవగా సిడ్నీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో గబ్బా టెస్టుపైనే అందరి ఆసక్తి నెలకొంది. సిరీస్ ఫలితాన్ని ఈ మ్యాచ్ నిర్ణయించనుంది. మరి టీమ్ఇండియా ఈ మ్యాచ్ గెలిచి మరోసారి చరిత్ర సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి.
ఇవీ చదవండి..
ఆఖరి పోరాటం
స్టీవ్ స్మిత్ కథలో మరో మలుపు