ఐపీఎల్‌లో ఆ విజయాలు అదరహో..

తాజా వార్తలు

Published : 01/04/2021 01:20 IST

ఐపీఎల్‌లో ఆ విజయాలు అదరహో..

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ అంటేనే రసవత్తరంగా సాగే మ్యాచులకు వేదిక. బ్యాట్స్‌మెన్‌ ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తిస్తే.. బౌలర్లు పదునైన యార్కర్లు, బుల్లెట్ లాంటి బౌన్సర్లతో ఆటగాళ్లను హడలెత్తిస్తారు. మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొడతారు. ఇలా ఎన్నో మలుపు తిరుగుతూ సాగే ఐపీఎల్‌ మ్యాచులు కొన్నిసార్లు ఏకపక్షంగా సాగుతాయి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి కొండంత లక్ష్యాన్ని కళ్లముందు ఉంచితే.. దాన్ని ఛేదించేందుకు దిగిన జట్టు.. కనీసం పోటీని కూడా ఇవ్వకుండా తక్కువ స్కోరుకే ఆలౌటవుతుంది. దీంతో ప్రత్యర్థి జట్టు భారీ పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డులకెక్కుతుంది. ఇక ఐపీఎల్‌లో భారీ పరుగుల విజయాలను సాధించిన టాప్‌-5 జట్లపై ఓ లుక్కేద్దాం.

1. ముంబయి Vs దిల్లీ (146 పరుగులు)

2017లో ముంబయి ఇండియన్స్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌(ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌) మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఆటగాళ్లు లెండల్‌ సిమ్మన్స్‌, కీరన్‌ పొలార్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు భారీ స్కోరునందించారు. లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ ..ముంబయి బౌలర్ల ధాటికి  కేవలం 66 పరుగులకే కూప్పకూలింది. దీంతో ముంబయి ఇండియన్స్ 146 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. హర్భజన్‌ సింగ్‌, కర్ణ్‌ శర్మ తలో మూడు వికెట్లు తీసి దిల్లీ పతనాన్ని శాసించారు.


2.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు Vs గుజరాత్ లయన్స్‌ (144 పరుగులు)

2016లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ మధ్య జరిగిన పోరులో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ ఫోర్లు, సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ బ్యాట్‌తో సృష్టిస్తున్న విధ్వంసానికి బంతులు ఎక్కడ వేయాలో అర్థంకాక బౌలర్లు తలలు పట్టుకున్నారు. విరాట్‌ కేవలం 55 బంతుల్లో 109 పరుగులు చేయగా.. డివిలియర్స్‌ (129; 52 బంతుల్లో 12×6, 10×4) పరుగులు సాధించాడు. వీరిద్దరూ శతకాలు బాదడంతో జట్టు 248 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ కనీసం పోరాడలేకపోయింది. లయన్స్‌ కేవలం 104 పరుగులకే తోకముడవడంతో బెంగళూరు 144 పరుగుల భారీ తేడాతో విజయ ఢంకా మోగించింది.


3. కోల్‌కతా Vs బెంగళూరు (140 పరుగులు)

అది 2008..ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌. కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్‌కు దిగిన  కోల్‌కతా.. బ్రెండన్‌ మెక్‌ కలమ్‌ (158; 73 బంతుల్లో 13×6, 10×4) పరుగులు చేయడంతో  ఆ జట్టు 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు జట్టులో.. ప్రవీణ్‌కుమార్‌ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. బెంగళూరు కేవలం 82 పరుగులకే కూప్పకూలడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 140 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.


                                                 

4. బెంగళూరు Vs పంజాబ్‌ (138 పరుగులు)

2015లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌) జట్ల మధ్య జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసింది ‘యూనివర్స్‌ బాస్‌’ క్రిస్‌గేల్‌(117; 12×6, 7×4) శతకంతో అదరగొట్టగా.. ఏబీ డివిలియర్స్‌ 24 బంతుల్లో 47 పరుగులతో రాణించడంతో 226 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. 88 పరుగులకే ఆలౌటవడంతో బెంగళూరు 138 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.   


                                                        

5. బెంగళూరు Vs పుణె వారియర్స్‌ (130 పరుగులు)

2013లో బెంగళూరు, పుణె వారియర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ టీ20 చరిత్రలోనే నిలిచిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 66 బంతుల్లో (175; 17×6, 13×4) పరుగులతో నాటౌట్‌గా నిలిచి చరిత్ర  సృష్టించాడు. గేల్‌ విధ్వంసంతో బెంగళూరు 20 ఓవర్లలో 263 పరుగుల  భారీ స్కోరును సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన పుణె వారియర్స్‌ బ్యాట్స్‌మెన్‌.. బెంగళూరు బౌలర్ల దెబ్బకు వరసగా పెవిలియన్‌ బాటపట్టారు. చివరకు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులే చేసింది. దీంతో బెంగళూరు 130 పరుగుల తేడాతో విజయం సాధించింది. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని