
తాజా వార్తలు
పర్యవేక్షణలో బుమ్రా.. మైదానంలోకి బెస్ట్ 11
బ్రిస్బేన్: టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయాన్ని వైద్యబృందం పర్యవేక్షిస్తోందని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ తెలిపాడు. గాయపడ్డ ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో తుది జట్టులో భారీ మార్పులు ఉంటాయని పరోక్షంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మూడో టెస్టు డ్రా కావడంతో నాలుగో టెస్టులో విజయం సాధించాలని భారత్, ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. అయితే భారత్‌ను గాయాల బెడద వేధిస్తుండటం గమనార్హం. కీలకమైన గబ్బా పోరులో జస్ప్రీత్ బుమ్రా ఉంటే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ అతడు సగం ఫిట్నెస్తో ఉన్నప్పటికీ ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీసును దృష్టిలో పెట్టుకొని ఆడించకపోవచ్చని తెలుస్తోంది.
‘గాయపడ్డ ఆటగాళ్లను పర్యవేక్షిస్తున్నాం. మా వైద్యబృందం ఆటగాళ్లను పరీక్షిస్తోంది. అయితే పరిస్థితుల గురించి ఇప్పుడే చెప్పలేను. ఆటగాళ్లకు కావాల్సినంత సమయం ఇస్తాం. చివరి టెస్టులో ఎవరెవరు ఆడతారో శుక్రవారం ఉదయం తెలుస్తుంది. గాయాలైనా కాకున్నా అత్యుత్తమ పదకొండు మందినే మైదానంలోకి పంపిస్తాం. టెస్టు క్రికెట్లో అవకాశాలకు వారంతా అర్హులే. వారంతా సామర్థ్యం మేరకు ఆడితే టీమ్ఇండియా ఎందుకు రాణించదో చెప్పండి. మేం మా ఆటగాళ్లకు అండగా ఉంటాం’ అని రాఠోడ్ అన్నాడు. చివరి టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్‌కు చోటు లభిస్తుందని సమాచారం.
‘జస్ప్రీత్ బుమ్రాను వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. చివరి టెస్టులో అతనాడతాడో లేదో మ్యాచ్‌కు ముందు తెలుస్తుంది. వైద్యబృందం సూచనలను బట్టి మేం నిర్ణయం తీసుకుంటాం. అతడు ఆడాలనుకుంటే ఆడతాడు. లేదంటే లేదు. ఏదేమైనా తుదిజట్టు వివరాలు మ్యాచ్‌కు ముందు తెలుస్తాయి’ అని విక్రమ్ రాఠోడ్ తెలిపాడు.
ఇవీ చదవండి
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్