
తాజా వార్తలు
ఐపీఎల్‌పై వ్యాఖ్యలకు స్టెయిన్ క్షమాపణలు
ఇంటర్నెట్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెటా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న అతడు ఐపీఎల్లో డబ్బుకే ప్రాధాన్యం ఉంటుందని, ఆటగాడికి ఉండదని అన్నాడు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు రావడంతో స్టెయిన్ స్పందిస్తూ ట్విటర్లో క్షమాపణలు చెప్పాడు.
‘నా కెరీర్లో ఐపీఎల్ ఏమాత్రం తక్కువ కాదు. ఆ లీగ్‌కు తగిన ప్రాధాన్యం ఉంది. అలాగే ఇతర ఆటగాళ్లకు కూడా ఉంటుంది. నా మాటలు ఏ లీగ్‌నూ కించపర్చడం, అవమానించడం లేదా పోల్చిచూడటం కోసం ఉద్దేశించినవి కావు. సోషల్ మీడియాలో ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు రాయడం సర్వసాధారణం. అయినా, నా మాటలకు ఎవరైనా నొచ్చుకొని ఉంటే క్షమాపణలు చెబుతున్నా’ అని పేర్కొంటూ స్టెయిన్ ట్వీట్ చేశాడు.
‘పీఎస్ఎల్, ఎల్పీఎల్లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు దక్కుతుంది. ఐపీఎల్ విషయానికొస్తే అక్కడ పెద్ద జట్లు ఉంటాయి. పేరున్న ఆటగాళ్లు కనిపిస్తారు. ఎవరెంత సంపాదిస్తున్నారన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. క్రికెట్ మరుగున పడిపోతుంది. పీఎస్ఎల్ కోసం ఇక్కడికి రాగానే చాలామంది ఆటగాళ్లు నా గదికి వచ్చి ఎక్కడెక్కడ ఆడారు? మీ ప్రయాణం ఎలా సాగిందని అడిగారు. ఐపీఎల్లో ఇలాంటివి కనిపించవు. ఎంత ధర పలికావన్నదే అక్కడ ప్రధాన చర్చ. అలాంటి వాటికి ఈ ఏడాది దూరంగా ఉండాలని అనుకున్నా’ అని స్టెయిన్ వ్యాఖ్యానించినట్లు మంగళవారం వార్తలు ప్రసారమయ్యాయి.