
తాజా వార్తలు
టీమ్ఇండియా కష్టాలు నాకూ తెలుసు: పైన్
బ్రిస్బేన్: ఒంటరి ప్రదేశాల్లో కుటుంబ సభ్యులు లేకుండా బయో బుడగల్లో గడపడం టీమ్ఇండియాకు కష్టంగానే ఉంటుందని ఆసీస్ సారథి టిమ్‌పైన్ అంగీకరించాడు. యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరిగినప్పుడు స్టీవ్‌స్మిత్, కమిన్స్ సహా తన సహచరులు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు. బ్రిస్బేన్‌లో నిర్వాహకులు కల్పించిన ప్రాథమిక సదుపాయాలపై భారత ఆటగాళ్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశాడు. నాలుగో టెస్టుకు ముందు పైన్ మీడియాతో మాట్లాడాడు.
గబ్బా టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్న టీమ్ఇండియా, ఆసీస్ ఆటగాళ్లకు ఓ హోటళ్లో బస ఏర్పాటు చేశారు. క్వీన్స్‌లాండ్‌లో యూకే వైరస్ స్ట్రెయిన్ కేసులు వస్తుండటంతో రెండు జట్లకు మరోసారి కఠిన క్వారంటైన్ ఏర్పాటు చేశారు. అక్కడ కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో భారత ఆటగాళ్లు అసంతృప్తి చెందినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది. ఫిర్యాదులు చేసిన వార్తలు రావడంతో మిచెల్స్టార్క్ సతీమణి అలీసా హేలీ భారత ఆటగాళ్లను ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.
‘అలాంటి వ్యాఖ్యలు నేను వినలేదు. నిజం చెప్పాలంటే టీమ్ఇండియా ఆటగాళ్లు ఫిర్యాదు చేసినట్టు ఎక్కడా చదవలేదు. ప్రత్యేక దేశంలో కుటుంబ సభ్యులు లేకుండా ఆంక్షల మధ్య ఉండాలంటే ఎవరికైనా కష్టమే. భారత ఆటగాళ్లు పడుతున్న ఇబ్బందుల్ని నేను అర్థం చేసుకోగలను. స్టీవ్‌స్మిత్, కమిన్స్ సైతం అలాంటి బాధల్ని అనుభవించారు. కష్టమే.. కానీ నేరుగా భారత ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం నాకైతే తెలియదు’ అని పైన్ అన్నాడు. కాగా హోటళ్లోని సమస్యలు టెస్టు మ్యాచుపై తమ ఏకాగ్రతను దెబ్బతీయలేవని టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ అన్నారు. మిగతా విషయాలు బీసీసీఐ, సీఏ చూసుకుంటాయని వెల్లడించారు.
ఇవీ చదవండి
‘అశ్విన్ ఒక్కడే 800 వికెట్లు తీస్తాడు’
వాహ్ అజహరుద్దీన్.. నువ్వెంతో గ్రేట్: సెహ్వాగ్