అనాథే.. ఒలింపిక్స్‌లో మన ఆశాదీపం

తాజా వార్తలు

Updated : 13/07/2021 19:53 IST

అనాథే.. ఒలింపిక్స్‌లో మన ఆశాదీపం

ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు.. ఆ బాధను మరిచిపోయేలోపే అమ్మ కూడా దూరమైంది.. ఏ ఆధారం లేని అమ్మాయి బతికి బట్ట కడితేనే గొప్ప అన్నారు... తను బామ్మ అండతో ఎదిగింది... పరుగునే ప్రాణం చేసుకుంది... కాళ్లకు బూట్లు లేకుండానే చిరుతలా పరుగెత్తింది... చివరికి క్రీడాకారులంతా అసూయపడేలా 400మీటర్ల మిక్స్‌డ్‌ రిలే విభాగంలో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతోంది.. ఆ అమ్మాయి రేవతి వీరమణిది స్ఫూర్తిగాథ.

రేవతి 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. తన సత్తా ఏంటో చూపి దేశానికి తప్పకుండా పతకం తీసుకొస్తానంటోంది. అది తన జీవితాశయం. ఈ స్థాయికి రావడానికి తను ఎన్నెన్ని వెతలు దాటి వచ్చిందో!   23 ఏళ్ల రేవతిది తమిళనాడు మదురై జిల్లాలోని సక్కిమంగళం. ఐదేళ్లు ఉన్నప్పుడు నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. మరో ఆర్నెళ్లకు తల్లి బ్రెయిన్‌ ఫీవర్‌తో రేవతిని, చెల్లిని విడిచి వెళ్లిపోయింది. బామ్మ అరమ్మాళ్‌ తప్ప ఎవరి అండ లేదు. తను కూలి పనులకు వెళ్తే చెల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ బడికెళ్లి చదువుకునేది. వాళ్లిద్దరికి కొంచెం వయసుకు రాగానే ‘ఇంకా ఎన్నాళ్లిలా కష్టపడతావ్‌? ఆడపిల్లల్ని పనికి పంపు’ అనేవాళ్లు బంధువులు. బామ్మ ఒప్పుకోకపోయేది. నా ప్రాణం పోయేంతవరకు పని చేసి పిల్లలిద్దరినీ బాగా చదివిస్తా అనేది.

పరుగు మొదలైంది..

76ఏళ్ల బామ్మ తమ కోసం పడుతున్న కష్టం అక్కాచెల్లెళ్లిద్దరికీ అర్థమైంది. ప్రాణం పెట్టి చదివేవాళ్లు. ఓసారి బడిలో పరుగు పందెం నిర్వహించారు. లేడీలా పరుగెత్తిన రేవతి ఫస్ట్‌ వచ్చింది. అంతా శెభాష్‌ అన్నారు. తనలో సహజసిద్ధమైన ప్రతిభ ఉందని గుర్తించారు ఆ స్కూల్‌ పీఈటీ. తనే డబ్బులిచ్చి మరీ చుట్టుపక్కల పోటీలకు పంపేవారు. రేవతి తప్పకుండా పతకంతో తిరిగొచ్చేది. తనకి మంచి వేదిక కావాలని తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి చెందిన కోచ్‌ కణ్ణన్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పట్నుంచి రేవతి జాతకమే మారిపోయింది. 2016 నుంచి 2019 వరకూ కణ్ణన్‌ శిష్యరికంలో మేటి అథ్లెట్‌గా రాటుదేలిపోయింది.

వెతలు దాటి..

రేవతి పరుగుల పోటీలకు వెళ్లడం బామ్మకు నచ్చేది కాదు కణ్ణన్‌ కష్టపడి ఒప్పించారు. మదురైలోని లేడీ డాక్‌ కాలేజీలో హాస్టల్‌ సీటు ఇప్పించారు. మొదట్లో తను పోటీల్లో పాల్గొన్నప్పుడు కనీసం కాళ్లకి బూట్లు కూడా ఉండేవి కాదు. కాలేజీ మీట్స్‌లోనే కాదు.. నేషనల్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో సైతం బూట్లు లేకుండా పరుగెత్తింది. తర్వాత కోచ్‌ సాయంతో స్పోర్ట్స్‌ కిట్‌, ఇతర అవసరాలు తీరాయి. సరైన ఆహారం తీసుకోవడం మొదలుపెట్టింది. రెండు మూడేళ్లలోనే రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించడంతో పటియాలాలోని ఎన్‌ఐఎస్‌ నేషనల్‌ క్యాంప్‌నకి ఎంపికైంది రేవతి. కణ్ణన్‌ శిష్యరికంలో వంద, రెండువందల మీటర్ల పరుగులో పోటీ పడ్డ తను జాతీయ కోచ్‌ గలీనా బుఖారియా సలహాతో 400 మీటర్ల పోటీలకు మారింది. ఆపై మరింతగా రాటుదేలిపోయింది. ‘రేవతీ.. నువ్వు మట్టిలో మాణిక్యం. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తావు’ అని మొదటిసారి ఆమె పరుగు చూసినప్పుడే చెప్పారు కణ్ణన్‌. ఇప్పుడు అది నిజమైంది. కానీ ఇంత త్వరగా ఆరోజు వస్తుందని రేవతి సైతం ఊహించలేదు.

విజయాలు

* 2019 ఫెడరేషన్‌ కప్‌ 200 మీటర్ల విభాగంలో రజత పతకం.

* ఇండియన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ 5, ఇండియన్‌ గ్రాండ్‌ప్రిక్స్‌ 6లలో 400మీటర్ల పరుగును 54.44, 53.63 సెకన్లలో పూర్తి చేసిన రికార్డు.

* నేషనల్‌ ఇంటర్‌స్టేట్‌ ఛాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల పరుగును 53.71 సెకన్లలో పూర్తిచేసిన పిన్న వయస్కురాలు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని