భారత జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు : ఇంగ్లాండ్‌ పేసర్ మార్క్‌ వుడ్‌

తాజా వార్తలు

Updated : 09/09/2021 04:06 IST

భారత జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు : ఇంగ్లాండ్‌ పేసర్ మార్క్‌ వుడ్‌

మాంచెస్టర్‌ :  భారత జట్టులో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు ఉన్నారని.. అందుకే ఆ జట్టుపై గెలవడం కష్టమని ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ అన్నాడు. ‘భారత్‌కి బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్లున్నారు. వారిద్దరూ క్రీజులో కుదురుకుంటే.. బౌలింగ్‌ చేయడం కష్టం. సమయోచితంగా ఆడుతూ అద్భుతంగా రాణించగలరు. అలాగే, మిడిలార్డర్‌లో ఛెతేశ్వర్‌ పుజారా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. టెస్టుల్లో వీరికి బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. ఆత్మవిశ్వాసం కోల్పోతే ఈ జోడిని విడదీయలేం. వీరిని త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రణాళికలు రచించాలి. అవి కొన్నిసార్లు సఫలీకృతం కావచ్చు, కాకపోవచ్చు. అందుకే, ప్రత్యర్థి జట్టు కూడా ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అని వుడ్‌ పేర్కొన్నాడు.

‘అలాగే, పదునైన పేస్‌ దళం ఉండటం భారత్‌కి మరో సానుకూలాంశం. ప్రతి జట్టులోనూ మంచి బౌలర్లుంటారు. కానీ, భారత జట్టులో అగ్రశ్రేణి బౌలర్లున్నారు. వాళ్లు బౌలింగ్‌లో వైవిధ్యం చూపించగలరు. ముఖ్యంగా మహమ్మద్ షమి కచ్చితత్వంతో బంతులేయగలడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి చాలా కష్టం’ అని వుడ్‌ అన్నాడు. 

‘చివరి టెస్టు మ్యాచులో మేం ఆఫ్‌ స్పిన్నర్ జాక్‌ లీచ్‌తో బరిలోకి దిగనున్నాం. స్పిన్‌కి అనుకూలించే ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో అతడిని ఆడించడం మంచి నిర్ణయం. ఇంతకు ముందు భారత్‌తో తలపడిన మ్యాచులో అతడు గొప్పగా రాణించాడు. అందుకే ఈ సారి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. భారత్‌ అతడి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని వుడ్‌ సూచించాడు. 

ఈ సిరీస్‌లో చివరి టెస్టు సెప్టెంబరు 10 నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి భారత్‌ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని