PV Sindhu: పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ స్టార్‌.. ఫ్యాషన్‌ ఐకాన్‌!

తాజా వార్తలు

Published : 03/08/2021 01:07 IST

PV Sindhu: పీవీ సింధు.. బ్యాడ్మింటన్‌ స్టార్‌.. ఫ్యాషన్‌ ఐకాన్‌!

వేదిక ఏదైనా పతకం మాత్రం పక్కా అని నిరూపిస్తోంది.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడలు, బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌, సూపర్‌ సీరిస్‌ టైటిళ్లు, ఒలింపిక్స్‌ ఇలా అనేక వేదికలపై పతకాల మోత మోగించింది. గత ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఆమె.. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. అంతేనా.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..!

* పీవీ సింధు.. పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. 1995 జులై 5న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ. వారిద్దరూ ఒకప్పుడు అథ్లెట్లు కావడం విశేషం. రమణ, విజయ జాతీయ స్థాయి వాలీబాల్‌ క్రీడాకారులు. సింధు తండ్రి రమణ 2000లో క్రీడారంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అర్జున అవార్డును పొందారు. 


* తల్లిదండ్రులు క్రీడాకారులు కావడంతో సహజంగానే సింధుకి కూడా క్రీడలపై ఆసక్తి పెరిగింది. అలా చిన్నవయసులోనే బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి అవ్వాలని రాకెట్‌ పట్టుకుంది.


* బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడానికి సింధు సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారు. 


* సింధుకు దివ్య అనే సోదరి ఉంది. 2012లో ఆమె వివాహం జరగ్గా సింధు ఆట వల్ల హాజరుకాలేకపోయింది. తన సోదరి వివాహం జరిగే సమయంలో సింధు లఖ్‌నవూలోని సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌ ఇండియా గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ పోటీల్లో పాల్గొంది. వ్యక్తిగత విషయాల కన్నా.. ఆటకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సింధు.. ఆటను కొనసాగించడానికి మొగ్గుచూపింది. అందుకే పెళ్లికి హాజరుకాలేపోయింది. 


* 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన సింధు.. ఇందుకోసం చాలా శ్రమించింది. ఈ సారి ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవాలన్న కసితో మరింత కఠోర శిక్షణ పొందింది. కానీ.. సెమీఫైనల్‌లో తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్‌కు చేరలేకపోయింది. కాంస్యం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన బింగ్జియావోపై గెలిచి పతకం దక్కించుకుంది. 


* గత ఒలింపిక్స్‌లో సింధు రజతం పతకం సాధించడంతో ఆమెకు మాజీ క్రికెటర్‌, వ్యాపారవేత్త చాముండేశ్వరీ నాథ్‌ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారు. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ తెందూల్కర్‌ చేతుల మీదుగా సింధు ఆ బహుమతిని అందుకుంది. తాజా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధుకు ప్రధాని నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. 


* శిక్షణలో లేనప్పుడు.. సింధు స్విమ్మింగ్‌, ధ్యానం, యోగా చేస్తుందట. 


* సింధు మంచి భోజన ప్రియురాలే. తరచూ వివిధ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటుంది. 


* ఓ క్రీడాకారిణి అయి ఉండి.. యుద్ధవిమానం తేజస్‌లో ప్రయాణించి అరుదైన ఘనతను సాధించింది సింధు. డీఆర్‌డీవో, రక్షణ శాఖ ఇచ్చిన అవకాశం మేరకు ఆమె కో-పైలట్‌గా వ్యవహరించింది.


* పీవీ సింధు బ్యాడ్మింటన్‌ స్టార్‌ మాత్రమే కాదు.. ఫ్యాషన్‌ ఐకాన్‌ కూడా. అప్పుడప్పుడు సంప్రదాయ, ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరుస్తుంటుంది. 


* క్రీడారంగంలో సింధు ప్రతిభను మెచ్చి అనేక అవార్డులు వరించాయి. 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న, 2020లో పద్మ భూషణ్‌ అవార్డులు లభించాయి. 

ఇంటర్నెట్‌ డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని