INDvsSL: టీమ్‌ఇండియాది సాహసోపేతమైన నిర్ణయం 

తాజా వార్తలు

Updated : 29/07/2021 22:52 IST

INDvsSL: టీమ్‌ఇండియాది సాహసోపేతమైన నిర్ణయం 

శ్రీలంకతో రెండో టీ20 ఆడటంపై ఇంజమామ్‌ ఉల్‌ హక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంకలో పర్యటిస్తున్న టీమ్‌ఇండియాను పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ప్రశంసించాడు. జట్టులో ఒక ఆటగాడు కరోనా బారినపడినా, మరో 8 మంది ఐసోలేషన్‌లో ఉన్నా.. అందుబాటులో ఉన్న యువకులతో రెండో టీ20 ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధావన్‌ జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైనా.. 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చివరి ఓవర్‌ వరకూ తీసుకెళ్లడం అందర్నీ ఆకట్టుకుంది. దాంతో ప్రతి ఒక్కరూ భారత జట్టును ప్రశంస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్‌ మాజీ సారథి సైతం టీమ్‌ఇండియాను కొనియాడాడు. ఓటమి భయం లేకుండానే బరిలోకి దిగిందని మెచ్చుకున్నాడు.

‘కొవిడ్‌-19తో టీమ్‌ఇండియా బాగా దెబ్బతింది. కృనాల్‌ పాండ్య కాకుండా మరో 8 మంది అందుబాటులో లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు రెండో టీ20 నుంచి తప్పుకునే అవకాశం ఉన్నా ధైర్యంగా ముందడుగు వేశారు. దీంతో వారికి భయం లేదని అర్థమవుతోంది. ఎవరైనా నిర్భీతిగా ఆడితే.. విజయం దానంతట అదే వస్తుంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న ఆటగాళ్లపై నమ్మకం ఉంచిన జట్టు యాజమాన్యం వారితోనే మ్యాచ్‌ ఆడించింది. ఈ మధ్య ఆ జట్టు ఎంతో ధైర్యంగా ఆడుతోంది. కఠిన పరిస్థితులను కూడా ఎదుర్కొనే విధంగా మానసికంగా సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైనా పోరాడకుండా వదలలేదు. స్కోరుబోర్డుపై 132 పరుగులే చేసినా ఆతిథ్య జట్టును చివరి వరకూ తీసుకెళ్లారు. అది టీమ్‌ఇండియా పట్టుదలకు నిదర్శనం’ అని ఇంజమామ్‌ పేర్కొన్నాడు.

అది రాహుల్‌ ద్రవిడ్‌ చలవే..

టీమ్‌ఇండియా ఇలా మానసికంగా బలంగా తయారవ్వడానికి రాహుల్‌ ద్రవిడే ప్రధాన కారణం. ఆటగాళ్ల టెక్నికల్‌ నైపుణ్యాలు సరిచేయడం ఒకెత్తయితే, వారిని మానసికంగా దృఢంగా మార్చడం ఇంకో ఎత్తు. ఒక జట్టులో ఇలాంటి నిర్దిష్టమైన ఆటగాళ్లు ఉంటే వారిని ఓడించడం అంత తేలిక కాదు. ఏ జట్టులో అయినా గెలుపోటములు సర్వసాధారణం. కానీ, టీమ్‌ఇండియా ఇప్పుడు సరైన ఆటగాళ్లు లేకున్నా మ్యాచ్‌ ఆడాలని తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. అలాగే భారత జట్టుకు ఏ ఆటగాడు ఎంపికైనా అది 15 మంది బృందంలో కావచ్చు లేదా 20 మంది బృందంలో కావచ్చు.. అతడు తుది జట్టులో ఉండే అర్హత కలిగిన వాడని నేను బలంగా విశ్వసిస్తున్నా’ అని ఇంజమామ్‌ అభిప్రాయపడ్డాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని