లుకేమియాను దాటి.. టోక్యో ఒలింపిక్స్‌కు

తాజా వార్తలు

Published : 05/04/2021 08:46 IST

లుకేమియాను దాటి.. టోక్యో ఒలింపిక్స్‌కు

జపాన్‌ స్విమ్మర్‌ రికాకో స్ఫూర్తి గాథ

టోక్యో: నీటిపైనే ప్రాణం పెట్టుకుని.. స్విమ్మింగ్‌లో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కలలు కన్న ఆ స్విమ్మర్‌కు లుకేమియా (రక్త క్యాన్సర్‌) రూపంలో అడ్డుకట్ట పడింది. రెండేళ్ల క్రితం తనకా వ్యాధి నిర్ధారణ కావడంతో నిరాశలో మునిగిపోయింది. తన కెరీర్‌ అక్కడే ఆగిపోతుందేమోననే భయం పెట్టుకుంది. కానీ అలా జరిగి ఉంటే తన స్ఫూర్తి గాథ ఇలా మనం చెప్పుకునే అవసరం లేకుండేది. తిరిగి ఈత కొలనులో అడుగుపెట్టాలనే తపన.. క్యాన్సర్‌ను అధిగమించేలా చేసింది. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా సాగిన ఆమె.. ఈ ఏడాది స్వదేశంలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమే.. జపాన్‌ స్విమ్మర్‌ రికాకో. ఆదివారం ఆ దేశ జాతీయ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ మహిళల 100మీ. బటర్‌ఫ్లై రేసును  57.77 సెకన్లలో పూర్తి చేసిన ఆమె.. ఒలింపిక్స్‌ మెడ్లీ రిలే బెర్త్‌ను దక్కించుకుంది. రేసు పూర్తయిన తర్వాత ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయిన తను భోరుమని ఏడ్చేసింది. ఆ కన్నీటి వెనక తను రెండేళ్ల పాటు అనుభవించిన నరకం, దాని నుంచి బయటపడేందుకు పడిన కష్టం ఉన్నాయి. ‘‘100మీ. రేసును గెలుస్తానని అనుకోలేదు. అయిదేళ్ల క్రితం ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌తో పోలిస్తే ఇప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపించడమే అందుకు కారణం. చాలా కాలం వరకు తిరిగి ఈత కొలనులో విజయాన్ని అందుకుంటానని ఊహించలేదు’’ అని ఆమె పేర్కొంది. 20 ఏళ్ల రికాకో 2018 ఆసియా క్రీడల్లో ఆరు స్వర్ణాలు గెలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌ 100మీ. బటర్‌ఫ్లై విభాగంలో ఆరో స్థానంలో నిలిచింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని