
తాజా వార్తలు
అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఇంటర్నెట్‌డెస్క్: నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా ఆడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఆసీస్ 369 పరుగులు చేయగా, దానికి దీటుగా టీమిండియా 336 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. అయితే బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 200 పరుగులలోపే కట్టడి చేయాలని దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ పేర్కొంటున్నాడు. ఓపెనర్ వార్నర్‌ను వీలైనంత తొందరగా పెవిలియన్‌కు చేర్చాలని సూచించాడు.
‘‘భారత్ గొప్పగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను 200 పరుగులకే ఆలౌట్ చేయాలి. అప్పుడు ఆఖరి రోజు టీమిండియా 250 పరుగులను ఛేదించగలదు. ముఖ్యంగా వార్నర్‌ను తొందరగా ఔట్ చేయాలి. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అతడు వేగంగా పరుగులు సాధించగలడు. అయితే రేపటి ఆటలో భారత్ బౌలర్లు చెలారేగుతారని ఆశిస్తున్నా. అలా చేస్తే, మన బ్యాట్స్‌మెన్ మిగిలిన పనిని పూర్తిచేసి ఘనవిజయం సాధిస్తారు. బౌలర్లు తప్పక సత్తాచాటుతారని నేను చెప్పట్లేదు. కానీ మంచి ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నా’’ అని గావస్కర్ తెలిపాడు.
టీమిండియా టెయిలెండర్లను గావస్కర్ కొనియాడాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు అంత తేలిగ్గా వికెట్లు ఇవ్వలేదని అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ కంటే ఆసీస్ 54 పరుగుల ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా, రెండో టెస్టులో టీమిండియా గెలిచింది. హనుమ విహారి, అశ్విన్ పోరాటంతో మూడో టెస్టు డ్రా ముగిసింది.
ఇదీ చదవండి
ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్