
తాజా వార్తలు
ఇంగ్లాండ్ అలా చేస్తే.. టీమ్ఇండియాపై ఒత్తిడి!
ఇంటర్నెట్‌డెస్క్: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధిస్తే టీమ్ఇండియా ఒత్తిడికి గురవుతుందని పర్యాటక జట్టు మాజీ సారథి నాసర్ హుసేన్ అభిప్రాయపడ్డాడు. చివరి మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించే అవకాశం ఉందని.. అలా జరగాలంటే తొలి టెస్టులాగే ఇప్పుడు కూడా తొలి ఇన్నింగ్స్‌లో 200 స్కోర్ చేయాలని హుసేన్ అన్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
‘నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ సాధించడం ఒక్కటే మార్గం. గడిచిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు 200 స్కోర్ దాటలేదు. పింక్‌బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అలా చేసి ఉంటే, ఆ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. తొలి టెస్టులాగే ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ తొలుత భారీ స్కోర్ చేసి తర్వాత ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దించితే టీమ్ఇండియా ఒత్తిడికి గురవుతుంది. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇంకా నమ్మకముంది. ఇంగ్లాండ్ తమ బ్యాటింగ్ టెంపోను తిరిగి సొంతం చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీజులో ఫుట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలి’ అని హుసేన్ సూచించాడు.