WTC Final: కివీస్‌కు ఉపయోగమేనన్న పుజారా
close

తాజా వార్తలు

Published : 14/06/2021 10:27 IST

WTC Final: కివీస్‌కు ఉపయోగమేనన్న పుజారా

ఫైనల్‌ గెలవగల సత్తా తమకుందన్న నయావాల్‌

సౌథాంప్టన్‌: టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు రెండు మ్యాచులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. తమకు లభించిన 10-12 రోజుల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నాడు. నిజానికి ఇంగ్లాండ్‌ వాతావరణానికి అలవాటు పడటమే సిసలైన సవాలని వెల్లడించాడు. మానసికంగా ఇందుకు అలవాటు పడాలని సూచించాడు.

జూన్‌ 18న సౌతాంప్టన్‌ వేదికగా ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరుకు ముందు ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్‌ రెండు టెస్టులు ఆడింది. మొదటి మ్యాచ్‌ డ్రా కాగా రెండో మ్యాచులో విజయం సాధించి 1-0తో సిరీస్‌ నెగ్గింది. మరోవైపు భారత్‌ మ్యాచులేమీ ఆడలేదు. ఐపీఎల్‌ వాయిదా పడటంతో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించలేదు. క్వారంటైన్‌ వల్ల సన్నాహక మ్యాచులూ ఆడలేదు. దొరికిన తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

‘ఫైనల్‌కు ముందే రెండు టెస్టులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరం. కానీ మేం ఫైనల్లో అత్యుత్తమంగా ఆడతాం. ఈ ఛాంపియన్‌షిప్‌ను గెలవగల సత్తా మా జట్టుకు ఉందని తెలుసు. అందుకే మేం దాని గురించి ఆందోళన చెందడం లేదు. దొరికిన సమయాన్ని ఏకాగ్రతతో వినియోగించుకుంటున్నాం. అంతర్గత మ్యాచ్‌ ద్వారా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతున్నాం. ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొంటే ఫైనల్‌కు సిద్ధమైనట్టే’ అని పుజారా అన్నాడు.

‘ఇంగ్లాండ్‌లో ఒకే రోజు విభిన్నమైన వాతావరణం ఉంటుంది. బ్యాట్స్‌మన్‌ దానికి అలవాటు పడటమే అసలైన సవాల్‌. ఎందుకంటే హఠాత్తుగా వర్షం పడుతుంది. త్వరగా తేరుకుంటుంది. దాంతో వెంటనే మళ్లీ ఆడాల్సి వస్తుంది. అంటే మ్యాచ్‌ మధ్యలో ఇలాంటి అంతరాయాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఆ సవాళ్లను అంగీకరించాలి. మానసికంగా బలంగా ఉండాలి. ఏకాగ్రత అత్యున్నత స్థాయిలో ఉండాలి’ అని పుజారా తెలిపాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడుతున్నందుకు గర్వంగా ఉందని పుజారా అన్నాడు. క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాటే కఠినమైందని, ఆ ఒక్కటే తాను ఆడుతున్నానని వివరించాడు. కుర్రాళ్లంతా ఫైనల్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు. మ్యాచ్‌ గెలిస్తే చాలా బాగుంటుందని పేర్కొన్నాడు. అసలు ఫైనల్‌ చేరుకొనేందుకే టీమ్‌ఇండియా ఈ రెండేళ్లలో ఎంతో కష్టపడిందని వెల్లడించాడు. మహమ్మారి సమయంలో క్రికెట్‌ ఆడటం కఠినంగా అనిపించిందని, కుర్రాళ్లు అన్నింటినీ అర్థం చేసుకొని బయో బుడగలో గడుపుతున్నారని ప్రశంసించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని