
తాజా వార్తలు
పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
గబ్బా: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ తరచూ నోటికి పని చెప్పడంతో ఆ జట్టు దిగ్గజాలు షేన్ వార్న్, మార్క్ వా అసహనం వ్యక్తం చేశారు. బ్యాట్స్‌మెన్ ఆడేటప్పుడు పంత్ మాట్లాడటం మానేయాలని సూచించారు. తొలి రోజు లబుషేన్(108), మాథ్యూవేడ్(45) బ్యాటింగ్ చేస్తుండగా టీమ్ఇండియా కీపర్ ఏదో ఒకటి మాట్లాడుతూనే కనిపించాడు. అదే సమయంలో వార్న్, వా.. లైవ్ కామెంట్రీలోనే పంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వికెట్ కీపర్‌గా పంత్ ఏం మాట్లాడినా అభ్యంతరం లేదని, అయితే.. బౌలర్ బంతులేసేటప్పుడు మాత్రం మాట్లాడకుండా ఉండాలని మార్క్ పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్లు కలగజేసుకోవాలని సూచించాడు. ఇదే విషయమై స్పందించిన వార్న్.. మార్క్‌వా మాటలను సమర్థిస్తున్నట్లు చెప్పాడు. ‘మీ మాటలతో ఏకీభవిస్తాను. పంత్ తన పరిమితుల మేరకు ఏం చేసినా పర్లేదు. కానీ బౌలర్ బంతులేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం మాట్లాడకుండా ఉండాలి. అతడు బ్యాట్స్‌మెన్ దృష్టిని మరల్చకూడదు ’ అని పేర్కొన్నాడు. కాగా, బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తొలుత ఇరు జట్ల మధ్యా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నా ఒక్కసారిగా ఆ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడటం, కెప్టెన్ టిమ్‌పైన్ అశ్విన్‌ను దూషించడం లాంటి సంఘటనలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తాజా టెస్టులో ఇలా జరగడం గమనార్హం.
ఇవీ చదవండి..
60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
గావస్కర్ ఏమైనా అనుకోని.. పర్లేదు: టిమ్‌పైన్