
తాజా వార్తలు
అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియన్ల దుష్ప్రవర్తన ఏ మాత్రం మారలేదు. సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆకతాయిల్ని స్టేడియం నుంచి బయటకు పంపించినా.. నాలుగో టెస్టులోనూ అలాంటి సంఘటనే పునరావృతమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఆఖరి టెస్టులో మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌పై దురహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా కూడా పేర్కొంది. సిరాజ్‌ను దూషిస్తున్నా ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటం గమనార్హం. అయితే దీనిపై టీమిండియా యాజమాన్యం, క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ స్పందించలేదు.
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్, సుందర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని స్థానిక మీడియా తెలిపింది. ప్రధానంగా సిరాజ్‌ను లక్ష్యంగా చేశారని వెల్లడించింది. లిరిక్స్‌ను మార్చి సిరాజ్‌ను దూషిస్తూ పాడటమే గాక, అనుచిత పదాలు వాడారని తెలిపింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా సిరాజ్‌కు యాదృచ్ఛికంగా ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదని, కావాలని చేసినట్లుగా ఉందని పేర్కొంది.
సిడ్నీ టెస్టులో కూడా భారత ఆటగాళ్లుకు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆటలో బుమ్రా, సిరాజ్‌పై కొందరు ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ అవాంఛనీయ సంఘటనను క్రికెట్ ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. అయితే నాలుగో రోజు ఆటలో కూడా సిరాజ్‌ను ఉద్దేశిస్తూ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మ్యాచ్ అధికారులకు టీమిండియా ఫిర్యాదు చేయడంతో ఆటను పది నిమిషాల పాటు నిలిపివేశారు. ఆకతాయిల్ని స్టేడియం బయటకు పంపించారు. ఇలాంటి సంఘటన మరోసారి పునరావృతం కాదని ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) బోర్డు పేర్కొంది. టీమిండియాకు క్షమాపణలు కూడా తెలిపింది. అయితే సీఏ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే మరోసారి భారత ఆటగాళ్లు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవడం గమనార్హం. దీనిపై సీఏ ఎలాంటి జవాబు చెబుతుందో చూడాలి.
ఇదీ చదవండి
అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!