
తాజా వార్తలు
ఈ ఐపీఎల్లో హైదరాబాదే తొలి జట్టు!
ఇంటర్నెట్ డెస్క్: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 14వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) జట్టే ప్లే ఆఫ్స్‌కు చేరబోయే తొలి టీమ్‌గా నిలుస్తుందని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ టీ20 లీగ్‌లో గత ఐదేళ్లుగా నిలకడగా రాణిస్తున్న ఎస్ఆర్హెచ్ ఈసారి తొలి రెండు స్థానాల్లోనే ఉంటుందని అంచనా వేశాడు.
‘హైదరాబాద్ కచ్చితంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. అక్కడి నుంచి 1 లేదా 2వ స్థానంలో నిలుస్తుంది. అదే ప్లే ఆఫ్స్‌కు చేరే తొలి జట్టు. ఆ జట్టు ఆడే తొలి తొమ్మిది మ్యాచుల్లో ఆరు గెలుస్తుంది. ఈ ఒక్క జట్టే ముంబయి ఇండియన్స్‌కు సవాలు విసురుతుందని అనిపిస్తుంది. రోహిత్ సేనతో నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండింటిని గెలుస్తుంది’ అని చోప్రా చెప్పుకొచ్చాడు. మరోవైపు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఎప్పటిలాగే ఈసారి కూడా రెచ్చిపోతాడని చెప్పాడు. ఎస్ఆర్హెచ్ తరఫున అతడు అత్యధిక పరుగులు చేస్తాడన్నాడు.
చివరగా బౌలర్లపై స్పందించిన చోప్రా.. రషీద్‌ఖాన్ పర్పుల్ క్యాప్ అందుకునే అవకాశం ఉందని చెప్పాడు. అతడు అత్యధిక వికెట్లు తీయడమే అందుకు కారణమన్నాడు. సన్‌రైజర్స్ ఆడబోయే తొలి ఐదు మ్యాచ్‌లు చెన్నైలో అని, తర్వాత నాలుగు మ్యాచ్‌లు దిల్లీలో అని మాజీ క్రికెటర్ గుర్తుచేశాడు. దాంతో ఆ రెండు పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమని, ఈ తొమ్మిది మ్యాచుల్లో ఇప్పటికే అతడి ఖాతాలో 15 వికెట్లు పడినట్లేనని చోప్రా పేర్కొన్నాడు. ఇక భువనేశ్వర్ తిరిగి క్రికెట్ ఆడుతుండడంతో ఈసారి ఆ జట్టు తరఫున అన్ని మ్యాచ్‌లు ఆడతాడన్నాడు. భువి చాలా పొదుపుగా బౌలింగ్ చేయడమే అందుకు కారణమన్నాడు. కాగా, హైదరాబాద్ గతేడాది ఐపీఎల్లో తొలి సగభాగంలో సరిగ్గా ఆడకపోయినా తర్వాత పుంజుకొని ప్లే ఆఫ్స్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి చోప్రా చెప్పినట్లు నంబర్ 1 లేదా 2లో నిలుస్తుందో లేదో వేచిచూడాలి.