Team India: విహారానికి అడ్డులేదు 

తాజా వార్తలు

Published : 07/07/2021 01:25 IST

Team India: విహారానికి అడ్డులేదు 

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు పాజిటివ్‌ అని తేలినా..

లండన్‌: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం అక్కడే ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రస్తుతం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ తర్వాత సుమారు 40 రోజుల ఖాళీ సమయం దొరకడంతో జట్టు యాజమాన్యం వారికి 20 రోజులపాటు బ్రేకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోహ్లీసేన లండన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.

అయితే, మంగళవారం ఇంగ్లాండ్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా ఆ క్రికెట్‌ బోర్డులో ఆందళన నెలకొంది. ఆదివారం లంకతో మూడో వన్డే పూర్తయ్యాక ఆ జట్టు సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పలువురు వైరస్‌ బారిన పడ్డారని తేలింది. ఆ జట్టునంతా ఐసోలేషన్‌ చేశారు. దాంతో టీమ్‌ఇండియా ఆటగాళ్లను కూడా వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లమనే ఆదేశాలు జారీ చేస్తారేమోననే సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా పీటీఐతో మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి.. అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ భారత  ఆటగాళ్లు విహార యాత్రలను కొనసాగిస్తున్నారని చెప్పారు.

‘అక్కడేం జరుగుతుందనేది మాకు తెలుసు. ఏదైనా ఆరోగ్య భద్రతకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తే వెంటనే మాకు సమాచారం వస్తుంది. అప్పుడు ఆ నియమాలను కచ్చితంగా అమలుచేస్తాం. ఇప్పటికైతే మాకు ఎలాంటి సమాచారం అందలేదు. ఆటగాళ్లకు తమ విశ్రాంతి సమయాన్ని కుదింపు చేసుకోవాలని చెప్పలేదు. చాలా మంది క్రికెటర్లు ఇప్పుడు తమ కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి లండన్‌, చుట్టుపక్కల ప్రాంతాల్లో విహరిస్తున్నారు. వాళ్లంతా ఒక్కసారి కలిసిపోతే కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాతే బయోబుడగలోకి అనుమతిస్తారు’ అని అధికారి వివరించారు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులో కరోనా కేసులు నమోదవ్వడంతో బుధవారం నుంచి పాకిస్థాన్‌తో తలపడే వన్డే సిరీస్‌కు కొత్త జట్టును, సహాయక సిబ్బందిని ఎంపిక చేయనున్నట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ యాష్లీ గైల్స్‌ వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని